బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
రాష్ట్రంలో అస్తవ్యస్తంగా పాలన
ప్రజా సమస్యలపై పార్టీ శాఖలు ఉద్యమించాలి
విద్యార్థులు, యువతను ప్రోత్సహించాలి
సీపీఐ కృష్ణా జిల్లా వర్క్‌షాప్‌లో రామకృష్ణ
విశాలాంధ్ర`గన్నవరం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ కృష్ణాజిల్లా సమితి సభ్యులు, శాఖ కార్యదర్శుల వర్క్‌షాప్ గురువారం గన్నవరం సమీపంలోని దావాజీగూడెంలో ఉన్న ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాలులో అమరజీవి కాట్రగడ్డ పెదవెంకట్రా యుడు ప్రాంగణంలో నిర్వహించారు. సీపీఐ గన్నవరం నియోజకవర్గ కార్యదర్శి పెద్దు వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో రైతుల ఆత్మహత్యలు నిలువరిస్తామని, ధరల పెరుగుదలను అడ్డుకుంటామని, విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తీసుకొస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయినా ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కేంద్రం చేసిన మూడు వినాశకర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 11 నెలలుగా వీరోచిత పోరాటం సాగిస్తున్నా మోదీ స్పందిం చడం లేదని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారుతో రైతులను ఢీకొట్టి నలుగురిని చంపినా కనీసం సంతాపం కూడా తెలపలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంటనూనె, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. నల్లధనం తీసుకురాకపోగా, కార్పొరేట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా, కరోనా సమయంలో పరిశ్రమలు మూసివేయడం వల్ల 2.5కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. కరోనా కట్టడిలో కూడా కేంద్రం ఘోరంగా విఫలమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వాన్న ప్రభుత్వం ఎప్పుడూ లేదని, మోదీ విధానాలు దేశాన్ని, రాజకీయాలను ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకువెళుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవతో ఇటీవల19 రాజకీయ పార్టీల సమావేశం జరిగిందని, మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసిపోరాడాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కూడా నిర్ణయించారని తెలిపారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని రామకృష్ణ అన్నారు. కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను బాగానే అమలు చేస్తున్నారని, అభివృద్ధి గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో రూ.రెండు లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయినా అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు. కనీసం రోడ్లు బాగు చేయలేని దుస్థితి నెలకొం దన్నారు. ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని, విభజన హామీలు అమలు కోసం ఒత్తిడి చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని, ప్రజలు నమ్మి 23 మంది ఎంపీలను గెలిపిం చారని, అయితే ప్రత్యేక హోదా, విభజన హామీలు కాదు కదా… కనీసం ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నా నోరుమోదపలేని దుస్థితిలో ముఖ్యమంత్రి, ఎంపీలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం కలిగి ఉండే పార్టీ శాఖలు క్రియాశీలకంగా పని చేయాలని, పాలకుల విధానాలను అన్ని వర్గాల వారికి వివరించి పోరాటాలకు సమాయత్తం చేయాలని సూచించారు. విద్యార్థి, యువజన సంఘాలను బలోపేతం చేయాలని, వారిని ప్రోత్సహించాలని, ప్రజా సంఘాలను పటిష్ఠంగా నిర్మాణం చేయాలని చెప్పారు. నవంబరు1 నుంచి 20వ తేదీ వరకు అన్ని శాఖల సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని రామకృష్ణ సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ అన్ని శాఖల నాయకులు గ్రామ, వార్డు సచివాలయాలతో సంబంధాలు కొనసాగించాలని, ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవచూపాలని సూచించారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఉన్న ఐదు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు, కోనేరు భూ కమిటీ సిఫార్సుల అమలు కోసం పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయాలు, ప్రజల్లో మార్పులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా ప్రజల పార్టీగా సీపీఐని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ వర్క్‌షాప్ దోహదపడాలని ఆకాంక్షించారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని వెంకటరామారావు మాట్లాడుతూ మోదీ ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేశారని, తన విధానాల ద్వారా దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నారని విమర్శించారు. మోదీ విధానల వల్ల 45 కోట్ల మంది కనీస వసతులు లేకుండా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ గ్రామ శాఖలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలపై చర్చించి పరిష్కారానికి పోరాడాలని సూచించారు. ప్రజా సంఘాలు స్వయం ప్రతిపత్తితో పని చేసేలా బలోపేతం చేయాలన్నారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ పార్టీ శాఖలు, ప్రజాసంఘాల నిర్మాణానికి, నూతనోత్తే జంతో పని చేసేందుకు ఈ వర్క్‌షాప్ దోహద పడాలని ఆకాంక్షించారు.
తొలుత పార్టీ జెండాను రామకృష్ణ ఆవిష్కరించారు. అక్కినేని వనజ సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా, ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రజానాట్య మండలి కళాకారులు విప్లవగేయాలను ఆల పించి, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిం చారు. సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోదుమూడి రామారావు, తూము కృష్ణయ్య, అడ్డాడ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా హేమసుందర రావు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు తదితరులు వేదికపై ఆశీనులయ్యారు.