ఉపాధి పనుల్లో కులాల వారీ వేతనాలు వద్దు
కేంద్ర ప్రభుత్వ మెమోలు ఉపసంహరించాలి
మాజీ ఎమ్మెల్సీ, బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు జల్లి విల్సన్
ఉపాధి నిధుల కోతకు కుట్ర : వెంకటేశ్వర్లు, దడాల సుబ్బారావు
కూలీల్లో వివక్ష వస్తుంది : డీహెచ్‌పీఎస్, కేవీపీఎస్
ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ఉపాధి హామీ పథకం కూలీలకు కులాల వారీగా వేతనాలు ఇవ్వాలంటూ మోదీ ప్రభుత్వం రాష్ట్రాలకు జారీజేసిన మెమోలు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని తక్షణమే ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ డిమాండు చేశారు. ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు(బీకేఎంయూ
ఏఐఏడబ్ల్యూయూ), డీహెచ్‌పీఎస్, కేవీపీఎస్, రైతు, కౌలురైతు, వృత్తిదారులు, సామాజిక సంస్థల రాష్ట్ర కమిటీల నేతృత్వంలో.. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి అడిగినన్ని పనిదినాలు, రూ.10వేల నగదు, 18 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండు చేస్తూ సోమవారం తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కులాల వారీగా వేతనాలు ఇచ్చే ప్రతిపాదనను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నేతలు నినదించారు. ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభలో జల్లి విల్సన్ మాట్లాడుతూ మత ప్రాతిపదికన విభజన చర్యలకు ప్రధాని మోదీ ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో కులాలవారీగా వేతనాలు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం తగదన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కరోనా ముగిసేవరకు ఉపాధి కూలీలకు అదనంగా సమ్మర్ అలవెన్సు పొడిగించాలని డిమాండు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రం సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం ఆదేశాలను అంగీకరిస్తూ ముందుకు పోవడం తగదని హితవు పలికారు. మోదీ ప్రభుత్వ మత, కులతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలతో సాధించుకున్న ఉపాధి చట్టం పరిరక్షణకు ఐక్యపోరాటాలే శరణ్యమని స్పష్టంచేశారు. ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఇబ్బందులకు గురవుతున్న ఉపాధి కూలీలకు కేరళ తరహాలో 18 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండు చేశారు. పనులు లేక వ్యవసాయ కార్మికులంతా వలస పోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 20లక్షల మంది వ్యవసాయ కార్మికులున్నారని తెలిపారు. ఉపాధి నిధులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల ఉపాధి కల్పించాలని డిమాండు చేశారు. దడాల సుబ్బారావు మాట్లాడుతూ మోదీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రాంతాల వారీగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీలో ఎస్సీ, ఎస్టీలకు, ఇతర కులాలకు వేర్వేరుగా కూలి ఇవ్వాలనడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప మాట్లాడుతూ కులాల వారీగా వేతనాలు ఇచ్చే పద్ధతి చాలా సమస్యలు, వివాదాలు, వివక్షలకు దారితీస్తుందని హెచ్చరించారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూలీలు, పేదలను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేకచట్టం తేవాలని డిమాండు చేస్తుంటే..దానికి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం కులాల వారీగా వేతనాలు ఇవ్వాలంటూ మెమోలు జారీచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సీఐటీయూ నాయకులు కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో ఉపాధి హామీ పథకానికి కత్తెర వేయాలనే కుట్ర చేస్తోందన్నారు. కౌలుదారుల సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం నాయకులు వెంకటేశ్వరరావు, డప్పుకళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి క్రాంతికుమార్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి కె.ఈశ్వరరావు, కుమార్, మరియదాసు, డీహెచ్‌పీఎస్ నాయకులు జి.ప్రసాద్, ఉపాధి మేట్లసంఘం నాయకురాలు కె.ఎలిజబెత్ రాణి, ప్రజాసంఘాలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఐదు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టరు చినతాతయ్యకు జల్లి విల్సన్, దడాల సుబ్బారావు అందజేశారు.
కర్నూలు కలెక్టరేట్ వద్ద…
కర్నూలు : కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి 10వేల రూపాయలు, 18 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆవులశేఖర్, ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు. రాష్ట్రసమితి పిలుపు మేరకు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏపీ వ్యవసాయ కార్మికసంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం, చేతివృత్తిదారుల సంఘం, డీహెచ్‌పీఎస్, కేవీపీఎస్, డీఎస్‌ఎంఎం, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఏఐఏడబ్ల్యూయూ జిల్లా అధ్యక్షులు నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆవుల శేఖర్, రామాంజనేయులు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నభిరసూలు, కె రాధాకృష్ణ, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్‌బాబు, జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, దళితహక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సి.మహేష్, రజకసంఘం నాయకులు శేఖర్, డప్పు కళాకారులు, చర్మకారులు, వ్యవసాయకూలీలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పీడీకి వినతిపత్రం అందజేశారు.