నేడు ప్రమాణస్వీకారం…బంగ్లా సైన్యాధిపతి జమాన్ ప్రకటన
ఢాకా: రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించను న్నారు. యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం గురువారం ప్రమాణ స్వీకారం చేయనుందని బంగ్లాదేశ్ సైన్యాధిపతి జనరల్ వాకర్-ఉజ్-జమాన్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లా డుతూ… గురువారం రాత్రి 8:00 గంటలకు తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పారు. సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉండవచ్చని కూడా ఆయన వెల్లడిరచారు. ఉద్యోగాలలో వివాదాస్పద కోటాపై షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు, హింస చోటుచేసు కుని ప్రధాని హసీనా పదవికి రాజీనామా సమర్పించి దేశం విడిచి వెళ్లిన నేపథ్యంలో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్‌ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు. 84 ఏళ్ల యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా సేవలందించి, బంగ్లాదేశ్‌లోని పేదల అభ్యున్నతి కోసం కృషిచేశారు. చిట్టగాంగ్‌లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థిక వేత్త. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందారు. పార్లమెంటును రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్‌లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్.
తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరునూ వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. హసీనా సర్కారుతో ఘర్షణపడినందుకు యూనస్‌పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరు నెలల జైలుశిక్ష పడిరది. తన దేశం, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు.