గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత
. బాలికల హాస్టల్ వాష్ రూమ్‌లో కెమెరాలు అమర్చారని విద్యార్థినుల ఫిర్యాదు
. హాస్టల్ లోపల విద్యార్థినులు, విద్యార్థి సంఘాల బైఠాయింపు
. ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు
. మంత్రి రవీంద్ర హామీతో ఆందోళన విరమణ
విశాలాంధ్ర బ్యూరో – మచిలీపట్నం/గుడివాడ: బాలికలు, విద్యార్థినులు, యువతులపై రోజురోజుకీ ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. విద్యా సంస్థల్లో వీరికి రక్షణ లేకుండాపోయింది. వీరిని కామాంధులు వెంటాడుతున్నారు. దీంతో చదువుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇప్పటికే కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. తాజాగా కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల ఘటనతో ఆడపిల్లలకు రక్షణ కరువైందన్న విషయం మరోసారి స్పష్టమైంది. కళాశాల అనుబంధిత విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్‌లో రహస్య (హిడెన్) కెమెరాలు ఏర్పాటు చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటనను పరిశీలిస్తే… గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజినీరింగ్ కళాశాలలో నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన స్నేహితురాలి సాయంతో బాలికల హాస్టల్ వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి నగ్న దృశ్యాలు చిత్రీకరించారని ఆరోపిస్తూ విద్యార్థినులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. విద్యార్థులకు మద్దతుగా కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్, పోలీసులు చెబుతున్న కథనాలు భిన్నంగా ఉన్నాయి. కాగా, హాస్టల్ ప్రాంగణంలోనే గురువారం అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళన చేస్తూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి యత్నించిన విషయం తెలుసుకొని కళాశాల హాస్టల్‌కు పోలీసులు రంగ ప్రవేశం చేసి నాల్గవ సంవత్సరం విద్యార్థి విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విద్యార్థినులు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శుక్రవారం కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కళాశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థినులు మాట్లాడుతూ వాష్ రూమ్‌లో రహస్య కెమెరాలను తమ హాస్టల్ విద్యార్థిని ఒకరు పెట్టినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. కళాశాల యాజమాన్యానికి విషయం తెలిపినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టామని తెలిపారు. వాష్ రూమ్‌కు వెళ్లాలంటే భయం వేస్తోందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కఠిన చర్యలు : మంత్రి కొల్లు రవీంద్ర
మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు కళాశాల వద్దకు చేరుకుని సమస్యపై విద్యార్థులతో చర్చించారు. కళాశాల యాజమాన్యంపై తమకు నమ్మకం లేదని, మూడు రోజులుగా ఈ సంఘటన గురించి తెలిసినప్పటికీ యాజమాన్యం విషయాన్ని తొక్కి పెడుతుతోందని, దీనిపై ఫిర్యాదు చేసే వారిపై చర్యలు ఉంటాయని కళాశాల యాజమాన్యం బెదిరించారని విద్యార్థులు మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తెచ్చారు. తమకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలని, అంతవరకు కళాశాలకు వెళ్లమని విద్యార్థులందరూ ముక్త కంఠంతో నినాదాలు చేశారు. ఈ సంఘటనలో వాస్తవాలు వెలికితీసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి విద్యార్థులకు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, బాధ్యులయిన వారు ఎంతటి వారైనా సరే వదిలేది లేదని స్పష్టం చేశారు. కళాశాల విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సంరక్షణ కల్పిస్తామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహం వార్డెన్‌పై గానీ, కళాశాల యాజమాన్యంపై గాని తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. మరల ఇలాంటి సంఘటనలు జరగకుండా భయపడే విధంగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావ్, మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు.
జిల్లా ఎస్‌పీ ఆర్.గంగాధరరావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందంలో అందరూ మహిళా పోలీసులే ఉన్నారన్నారు. గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇ.రమణమ్మను ప్రత్యేక అధికారిగా నియమించామన్నారు. ఆమెతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐటీ కోర్ ఎస్సై మాధురి, కమ్యూనికేషన్ పోలీసు సిబ్బంది నలుగురు ఉన్నారన్నారు. ఈ కేసులో ప్రస్తుతానికి ఎవరైతే బాధ్యులుగా విద్యార్థిని, విద్యార్థి పేరు చెబుతున్నారో వారి సెల్‌ఫోన్, లాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దాంట్లో ప్రతి చిన్న డాక్యుమెంటును శాస్త్రీయబద్ధంగా పరిశీలించడం జరుగుతుందని, దాంట్లో ఏ చిన్న మెటీరియల్‌గానీ, వీడియోగానీ ఉన్నఎడల దాన్ని గమనించి బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మీదట ఎవరు ఇటువంటి ఘాతుకాలు చేయడానికి సాహసించకుండా ఉండేవిధంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విచారణ ఎన్‌ఎల్‌జెడి (నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్) పరికరం ద్వారా క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసు యంత్రాంగానికి కొంత వెసులుబాటు కల్పిస్తే అన్ని విధాల పరిశీలించి వాస్తవాలు వెలికితీస్తామన్నారు. విద్యార్థినులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జరిగిన ఘటనపై ఎటువంటి వివక్షకు తావు లేకుండా విచారణ చేస్తామని, ఘటనలో ఎంతటి వారు ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు.
హాస్టల్‌లో ప్రత్యేక పోలీసు బృందం తనిఖీలు
వసతి గృహంలో విచారణ ప్రత్యేక అధికారి సీఐ రమణమ్మ, ఎస్సై పూర్ణ మాధురి నేతృత్వంలో పోలీసు బృందం విద్యార్థినులతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వాష్ రూమ్‌ల్లో తనిఖీ చేశారు. హాస్టల్‌లోని ప్రతి ఫ్లోర్‌కు మహిళా కానిస్టేబుల్స్‌ను రక్షణగా నియమిస్తున్నట్లు జిల్లా ఎస్పీ గంగాధరరావు విద్యార్థులకు తెలిపారు.