. రాచరిక చిహ్నాలు ప్రజల జీవితాల్లోకి ప్రవేశించకూడదు
. మెగసెసె అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ డిమాండ్
విశాలాంధ్ర – విజయవాడ: ప్రజాస్వామ్య దేశంలో ‘సింగోల్’ వంటి రాచరిక చిహ్నాలు ప్రజల జీవితాల్లోకి ప్రవేశించకూడదని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారీ ఆందోళన్ నేత బెజవాడ విల్సన్ అన్నారు. పార్లమెంట్‌లో రాజదండం స్థానంలో రాజ్యాంగం ప్రతిష్టించాలన్న డిమాండ్‌తో దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్) అధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ఎస్‌ఆర్ శంకరన్ మెమోరియల్ కమిటీ కన్వీనర్ జల్లి విల్సన్ అధ్యక్షతన విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఈ సదస్సు జరిగింది. బెజవాడ విల్సన్ మాట్లాడుతూ దేశాన్ని తల్లిగా చెబుతూ పాలకుల తప్పులు ఎత్తిచూపి…. ఎదిరించే వారి నోరు నొక్కేసే విధానం దేశంలో అమలవుతోందన్నారు. ప్రస్తుత పాలకులకు స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. పార్లమెంట్‌లో ఏది చేయకూడదో అది చేస్తున్నారని, ప్రజలను మోసం చేయడానికి బయట పార్లమెంట్‌కు మొక్కుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ యాధృచ్ఛికంగా ఏదీ చేయరని, ప్రతిదాని వెనుక వ్యూహం ఉంటుందన్నారు. అమెరికా అధ్యక్షుడు దిల్లీ కాకుండా అహ్మదాబాద్ వెళ్లారని, అక్కడ వ్యాపార లావాదేవీలు పూర్తిచేసుకుని దిల్లీ వచ్చారన్నారు. అమెరికా అధ్యక్షుడి పర్యటన వేళ పేదలు నివాసం ఉండే ప్రాంతాలు కనబడకుండా గోడలు నిర్మించారని గుర్తు చేశారు. గుజరాత్ మోడల్ అంటే చంపే వారు… చంపబడే వారుగా చీల్చటమేనన్నారు. నరహంతకులు రాజ్యమేలుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కులం, జాతి అనేవి అవమానకరం, దాష్టీకమైనవని చెప్పారు. విస్మరణకు గురైన అంశాలను ప్రజలకు వివరించేది కమ్యూనిస్టులేనని బెజవాడ విల్సన్ అన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తనను మొదటిసారి పార్లమెంట్‌లోకి తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. అంబానీ తన దర్పం ప్రదర్శించటానికి కుమారుడి వివాహాన్ని వేదికగా చేసుకున్నారని చెప్పారు. 1993లో చేతులతో మలమూత్రాలు తీయకూడదనే చట్టం వచ్చిందని, అయినా ఈ చట్టానికి సంబంధించి నేటికీ ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. మ్యాన్‌హోల్స్, మురికి గుంతలలో పడి అనేక మంది చనిపోతున్నారని చెప్పారు. మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయిన వారి లెక్కలు ప్రభుత్వం వద్ద లేవుగానీ… అడవుల్లో ఉన్న పులుల సంఖ్య మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. చంద్రమండలం, సూర్యమండలానికి వెళ్లే ఉపగ్రహాలను తయారు చేస్తారుగానీ… మ్యాన్‌హోల్స్ శుభ్రం చేసే యంత్రాలు కనిపెట్టరని పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆర్థిక విధానాలు కార్పొరేట్‌లకు అనుకూలంగా ఉండాలనే పద్ధతిలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం ఉండాలని, వ్యవస్థల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. కేంద్రంలో ముఖ్యమైన మంత్రిపదవులన్నీ బీజేపీ వద్దనే ఉన్నాయన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం అందరం కలిసి ఐక్యంగా పోరాడాల్సి ఉందన్నారు. అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఒకే వేదికగా పోరాటం చేయాలన్నారు. సీబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాచరికానికి తావులేదన్నారు. ముస్లిం పెద్దలు దానధర్మాలుగా ఇచ్చిన భూములను సక్రమంగా వినియోగించేందుకు ఉద్ధేశించిందే వక్ఫ్ ఆస్తుల చట్టమని వివరించారు. వక్ఫ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటాన్ని ఖండిరచాలని కోరారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీ నేతను నీ కులం ఏమిటి అని మరో ఎంపీ అడిగే పరిస్థితి వచ్చిందన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నదన్నారు. బీజేపీని బలపర్చేవారిని కూడా వ్యతిరేకించాలని కోరారు. మధ్య యుగాల నాటి ఆచార వ్యవహారాలను ప్రజలపై రుద్దాలని మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రాజదండం స్థానంలో రాజ్యాంగాన్ని ఉంచాలని డీహెచ్‌పీఎస్ చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు.
జల్లి విల్సన్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, సక్రమంగా అమలు జరిపించుకోవటం ప్రజల బాధ్యత అన్నారు. రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం సాధించాలన్నారు. అందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలని పిలుపునిచ్చారు. డీహెచ్‌పీఎస్ గతంలో న్యాయస్థానాల్లో జడ్జిల నియామకంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చేసిన పోరాటం పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చిందన్నారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో దళితుల హక్కులను ప్రస్తావించలేదన్నారు. రాముడ్ని రాజకీయ నాయకుడ్ని చేసినందుకు అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందన్నారు. సదస్సుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ముస్లిం జేఏసీ నాయకులు మునీర్ అహ్మద్, దళిత సంఘాల నాయకులు టి.చిట్టిబాబు, కొరివి వినయ్‌కుమార్ ప్రసంగించారు. తుపాకుల నాగేశ్వరరావు, డీహెచ్‌పీఎస్ విజయవాడ నగర అధ్యక్షుడు సంగుల పేరయ్య, ఎస్.శివాజీ, పరిశపోగు రాజేశ్, సీహెచ్ గోవింద్, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్‌బాబు, దేశ్యానాయక్, మహిళా సమాఖ్య నాయకులు బి.శాంతమ్మ, జి.రాహేలమ్మ తదితరులు పాల్గొన్నారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుట్టి రాయప్ప స్వాగతం పలుకగా… ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు వందన సమర్పణ చేశారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, కోశాధికారి ఆర్.పిచ్చయ్య అభ్యుదయ గీతాలు ఆలపించారు.