రూ.930 కోట్ల వ్యయంతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు
జీ ప్లస్ 18తో 12 టవర్లుగా నిర్మాణం
త్వరలో టెండర్లు పిలవనున్న సీఆర్‌డీఏ
విశాలాంధ్ర – బ్యూరోఅమరావతి: గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఐదు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయిన అమరావతి రాజధానిలో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ఇప్పటికే కంపచెట్లు పూర్తిస్థాయిలో తొలగించి శుభ్రం చేసిన సీఆర్‌డీఏ... తాజాగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టింది. 2014
19 టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని పరిధిలో నివాస సముదాయాల ప్రాజెక్టు నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆన్‌లైన్ బుకింగ్ నిర్వహించగా… కేవలం గంట వ్యవధిలోనే 1200 ప్లాట్లు బుక్ అయ్యాయి. ఆ సమయానికి భారత్‌తో పాటు వివిధ దేశాల్లో నివసించే తెలుగువారు దాదాపు 18 వేల మంది హ్యాపీనెస్ట్‌లో ప్లాట్ల కొనుగోలు కోసం ఆన్‌లైన్‌లో ఉండటం విశేషం. అటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిలిపివేసింది. అమరావతి రాజధాని నిర్మాణ పనులనే నిలిపివేయడంతో 25 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించిన ఆ యజమానులు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ తాజాగా రాజధాని పరిధిలో రూ.930 కోట్లతో హ్యాపీనెస్ట్ నివాస సముదాయాల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు అనుమతి మంజూరు చేసింది. జీ ప్లస్ 18 ప్రాతిపదికన ఆకర్షణీయమైన 12 టవర్లుగా నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ప్రాజెక్టుపై పడే రూ.216.61 కోట్ల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇచ్చేందుకు గతంలో సీఎం అధ్యక్షతన జరిగిన సీఆర్డీయే సమావేశంలో ఆమోదం తెలియజేసింది. గత ప్రభుత్వ హయాంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడంతో రూ.216 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు వీలుగా టెండర్లను సీఆర్డీయే జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపించింది. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణపనులు త్వరలో ప్రారంభించేందుకుగాను సీఆర్డీయే టెండర్లు పిలవనుంది.