యదేచ్ఛగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం
రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం బ డీజీపీని రీకాల్ చేయాలి
రామ్‌నాథ్ కోవింద్‌కు చంద్రబాబు ఫిర్యాదు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందని, రాష్ట్రపతి పాలన విధించి దేశ సమగ్రతను కాపాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లలో జరిగిన అరాచకాలను వివరిస్తూ 8 పేజీల లేఖను ఆధారాలతో సహా అంద జేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిశామన్నారు. ఏపీలో ఆర్టికల్ 356ను అమలు చేయాలని, దాడుల ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, ఏపీలో గంజాయి, హెరాయిన్‌పై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని, ఆయన చేసిన తప్పులకు శిక్షపడాలని కోరినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నట్లు ఆయా రాష్ట్రాల పోలీసులు చెప్పే పరిస్థితి వచ్చింద న్నారు. దేశంలోనూ, అంతర్జాతీయంగా ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్లు ఏపీలో ఉంటున్నాయని చంద్రబాబు ఆక్షేపిం చారు. మద్యపాన నిషేధం పేరుతో భారీగా రేట్లు పెంచారని, మాఫియాగా ఏర్పడి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆరోపించారు. ‘డ్రగ్స్ ఫ్రీ ఏపీ’ కోసం టీడీపీ పోరాడుతోందన్నారు. డ్రగ్స్‌తో యువత తద్వారా జాతి నిర్వీర్యమవు తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని నియంత్రించాలని కోరితే ఒకేరోజు టీడీపీ కార్యా లయాలపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి చేయడం చరిత్రలోనే మొదటిసారని, ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. మీడియానూ నియంత్రిస్తున్నారు. ప్రశ్నించినవారిపై ఇష్టానుసారంగా దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ, అడిగే హక్కు లేకుండా పోయిందన్నారు. వాళ్లే దాడి చేసి ప్రజలపై కేసులు పెడుతున్నారని, రాష్ట్రాన్ని భయానకంగా మార్చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతికి అవన్నీ వివరించా మన్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఏపీలో ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ మాఫియా దేశ సమగ్రతకు ముప్పుగా తయారయ్యే పరిస్థితి ఉందని, దీన్ని నియంత్రించాలని రాష్ట్రపతిని కోరామన్నారు. సీఎంతో కలిసి పోలీసు వ్యవస్థని డీజీపీ భ్రష్టు పట్టించారని, అందువల్ల డీజీపీని రీకాల్ చేయాలని కోరామన్నారు. వీటన్నింటిపై ప్రజాస్వామ్యయుతంగా టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని, దోషులను కఠినంగా శిక్షించే వరకు వదలి పెట్టబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు వెంట రాష్ట్రపతిని కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కళా వెంకట్రావు, పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, రామానాయుడు తదితరులున్నారు.