కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : భారీ వర్షాలు, వరదలు రాష్ట్ర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంకా వరద ముంపులోనే ఉన్న విజయవా డలోని అనేక ప్రాంతాలు నాలుగు రోజులుగా తిండి, నీరు లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం అవుతున్న తరుణంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కోస్తా మీదుగా కొనసాగుతోందని, రాష్ట్రంలో చెదురు మదురుగా వర్షాలు పడతాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరులో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ రెండు జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు వివరించింది.