మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంపే లక్ష్యం
శరవేగంగా ఆక్వా యూనివర్సిటీ పనులు
ఆక్వా రంగానికీ బీమా సౌకర్యానికి కృషి
సమీక్షలో సీఎం జగన్
చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెంపే లక్ష్యంగా ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. పశు సంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సరసమైన ధరలకే మత్స్య ఉత్పత్తులు ప్రజలకు చేరాలని, వినియోగం కూడా గణనీయంగా పెరగాలని సీఎం ఆకాంక్షించారు. ఇందుకోసం ఆక్వా హబ్‌ల ఏర్పాటు అవసరమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక వినియోగం 4.36 లక్షల మెట్రిక్ టన్నులని అధికారులు వివరించగా, దీన్ని ఏడాదికి 12 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలని సీఎం సూచించారు. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణతోపాటు ఇతర పనులను వేగవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్వా రంగానికి కూడా బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీ లించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ మీద బాగా ప్రచారం చేయడం ద్వారా వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలన్నారు. సీడ్, ఫీడ్ విషయంలో ఎక్కడా కల్తీకి తావుండరాదని స్పష్టం చేశారు. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్ ఎలా చేయించుకోవాలన్న దానిపై అందరికీ సమాచారం తెలియాలన్నారు. 35 ల్యాబ్స్‌లో ఇప్పటికే 14 ప్రారంభం కాగా, మరో 21 ల్యాబ్స్‌ను నవంబరులో ప్రారంభించేం దుకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలియజేయగా, ఈ ఆక్వాకల్చర్ ల్యాబ్‌లన్నింటినీ ఆర్బీకేలకు అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. తదుపరి రాష్ట్రంలో 7 ఫిషింగ్ హార్బర్లు, 5 ఫిష్ ల్యాండ్ సెంటర్లలో పనుల ప్రగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని సూచించారు. కేజ్ ఫిష్ కల్చర్, మరీకల్చర్‌లపై దృష్టి పెట్టాలని, వీటితో ఆదాయాలు బాగా పెరుగుతాయన్నారు. కేజ్ ఫిష్ కల్చర్‌కు సంబంధించి పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి దీనిపై రైతులు, ఔత్సాహికులను కలిపి ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్, మరో మూడు చోట్ల మరీకల్చర్‌ను మొదలుపెట్టాలని, వీటిపై అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింతగా విస్తరించాలని సీఎం వారికి మార్గనిర్దేశనం చేశారు. పశుసంవర్ధక శాఖపై సమీక్ష సందర్భంగా రాష్ట్రంలో డిస్పెన్సరీలు లేని మండలాలు ఉండటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, నలుగురు వైద్యులు, రెండు అంబులెన్స్‌లు పెట్టాలన్న విధానంతో ప్రజారోగ్యరంగంలో ముందుకు పోతున్నామని, ఇలాంటి హేతుబద్ధత, పటిష్టమైన వ్యవస్థ పశుసంవర్ధక శాఖలో కూడా ఉండాలని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పశువుల ఆస్పత్రుల్లో కూడా నాడు-నేడుపై కార్యాచరణ సిద్ధం చేయాలని, ఆగస్టులో ఏపీ అమూల్‌ను విశాఖపట్నం, అనంతపురము జిల్లాలకు విస్తరిస్తున్నట్లు సీఎం వెల్లడిరచారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ లిమిటెడ్ ఎండీ ఎ బాబు, మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.