ఐక్యపోరాటాలు మరింత ఉధృతం
. రావులపల్లి రవీంద్రనాథ్ హెచ్చరిక
. రాష్ట్రవ్యాప్తంగా కార్మికసంఘాల ఆందోళనలు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి... వాటిస్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేసే వరకూ తమ పోరాటం ఆగదని కార్మికసంఘాల నేతలు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చిన బ్లాక్ డే పిలుపు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాయి. దీనిలో భాగంగా విజయవాడ లెనిన్ సెంటర్‌లో కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల సంఫీుభావంతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ మాట్లాడుతూ నరేంద్రమోదీ అధికారం చేపట్టిన నాటి నుండి కార్మికవర్గం, రైతాంగంపై దాడులు మొదలు పెట్టారని మండిపడ్డారు. కార్మిక హక్కులు కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, రైతాంగం నడ్డి విరిచే మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారని, దీనిపై కార్మికులు, రైతులు ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా వీటిని అమలు చేసేందుకు మరింత పదునైన చట్టాల కోసం రూపకల్పన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొట్టేందుకు మరింత ఉధృతమైన ఐక్య పోరాటాల రూపకల్పనకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నర్సింగరావు, రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు మోదీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుండడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, రైతుసంఘం జిల్లా నాయకులు ఎం.యల్లమందారావు, ఏఐటీయూసీ విజయవాడ అధ్యక్ష, కార్యదర్శులు కేఆర్ ఆంజనే యులు, మూలి సాంబశివరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ, ఐఎఫ్‌టీయూ నాయకులు రవిచంద్ర, రామకృష్ణ, సీఐటీయూ నాయకులు శ్రీనివాసరావు, వెంకటే శ్వరరావు తదితర కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
విశాఖలో
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జగదాంబ జంక్షన్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు, అఖిలపక్ష కార్మిక సంఘాల అధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం.మన్మధరావు, ప్రధాన కార్యదర్శి జీఎస్‌జే అచ్యుతరావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్రావు, ఉపాధ్యక్షులు షేక్ రెహమాన్, జేడీ నాయుడు, జి. వామనమూర్తి, కసిరెడ్డి సత్యనారాయణ, కె.సత్యాంజనేయ, పి.చంద్రశేఖర్, స్టీల్ నాయకులు జె.రామకృష్ణ, కె.రాజబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేఏసీ నాయకులు ప్రధానికి రాసిన వినతి పత్రాన్ని విశాఖ జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
కృష్ణాజిల్లాలో
కేంద్రకార్మిక సంఘాల పిలుపులో భాగంగా కృష్ణాజిల్లా గుడివాడ ఏలూరురోడ్డులోని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ టి.తాతయ్య, గౌరవాధ్యక్షుడు గూడపాటి ప్రకాశ్‌బాబు, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జి.శేషు, సీహెచ్ సత్యనారాయణ, బిల్డింగ్ వర్కర్స్ జిల్లా కన్వీనర్ కె.సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో
నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక, రైతు, ప్రజాసంఘాల అధ్వర్యంలో అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బ్లాక్ డే కార్యక్రమం చేపట్టారు. ఇందులో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు, రైతు సంఘం నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.శంకర్రావు, జి.కోటేశ్వర రావు, కర్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో
44 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తూ యజమానులకు ఊడిగం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, లేబర్‌కోడ్‌లతో కార్మిక హక్కులు హరించబడతాయని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బ్లాక్ డే కార్యక్రమం ఏలూరు పాత బస్టాండ్ దగ్గర నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో
ఉండిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కలిశెట్టి వెంకట్రావు, ఉండి ఏరియా కార్యదర్శి తమరాని శ్రీనివాస్, కోన గొల్ల్లయ్య, సనపల శ్రీనివాస్, పున్నాని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చెల్లబోయిన రంగారావు, కిలారు మల్లేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
కాకినాడలో
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కాకినాడ హెడ్ పోస్ట్‌ఆఫీస్ వద్ద కార్మిక సంఘాల అధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. ఆందోళనను ఉద్దేశిస్తూ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, ఐఎఫ్‌టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరి వెంకటేశ్వర్లు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు తదితరులు మాట్లాడారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో గడియార స్ధంభం సెంటర్ వద్ద బ్లాక్ డే నిరసన కార్యక్రమం జరిగింది. శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.కృష్ణవేణి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరావు, జిల్లా కార్యదర్శి సఖి సూర్యనారాయణ ప్రసంగించారు.