కేరళలో 10 డ్యామ్‌లకు రెడ్‌అలర్ట్
శబరిమల యాత్ర నిలిపివేత
సహాయ శిబిరాలకు నిరాశ్రయులు
పథనంతిట్ట : కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. పథనంతిట్ట, కొట్టాయం, కొల్లం, ఇడుక్కి జిల్లాలోని జలాశయాల గేట్లను అధికారులు ఎత్తేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా శబరిమల ఆలయానికి ప్రస్తుతానికి ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నీటి మట్టాలు పెరుగుతుండడంతో కేరళలోని 10 డ్యామ్‌లకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక్కడి కక్కి డ్యామ్ రెండు గేట్లను పైకి ఎత్తారు. శబరిమలలోని అయ్యప్ప దేవాలయానికి యాత్ర నిలిపివేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కె.రాజన్ సోమవారం తెలిపారు.
పరిస్థితిని అంచనా వేయడానికి ఇక్కడ పథనంతిట్ట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశం తరువాత రాజన్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంపా నది నీటిమట్టం అమాంతం పెరిగినందున కక్కి డ్యామ్ నుంచి 100-200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. డ్యామ్ నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, అక్టోబర్ 20 నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొంత నీటిని ఇప్పుడు విడుదల చేయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని వారు చెప్పారు.
భారత వాతావరణ శాఖ (ఐఎండి) సమాచారం ప్రకారం.. అక్టోబర్ 20 నుంచి 24 వరకు భారీ వర్షాలు పడతాయి కనుక శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో తుల మాసం (అక్టోబరు మధ్య భాగం నుంచి నవంబరు మధ్య భాగం) పూజల యాత్రను అనుమతించలేమని వారు స్పష్టం చేశారు. రాబోయే వర్షాలతో పంపా నదిలో నీటి మట్టాలు మరింత పెరిగితే అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టమవుతుందని, ప్రస్తుతానికి యాత్రను ఆపడం తప్ప వేరే మార్గం లేదని మంత్రులు చెప్పారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు తాత్కాలికంగా తగ్గాయి. ముందు జాగ్రత్త చర్యగా పంపా నదీ తీరంలో నివసిస్తున్న ప్రజలను జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు తరలించడానికి సన్నాహాలు చేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 83 క్యాంపులు ఉన్నాయి.. అక్కడ 2,000 మందికి పైగా ఆశ్రయం పొందారు.. ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని మోహరించాం.. అవసరమైతే సహాయక చర్యలలో సహాయపడటానికి ఎయిర్‌లిఫ్ట్ బృందం సిద్ధంగా ఉందని రాజన్ చెప్పారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు సోషల్ మీడియాలో పుకార్లను వ్యాప్తి చేయవద్దని, ఇది సాధారణ ప్రజలలో భయాందోళనలు కలిగిస్తుందని మంత్రి అన్నారు. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వరదలు, కొండచరియలు అధికంగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని మరో మంత్రి జార్జ్ అన్నారు. రాష్ట్రంలోని పథనంతిట్ట, ఇడుక్కి, త్రిస్సూర్ జిల్లాలలో కక్కి, షోలయార్, మటుపట్టి, మూళీయార్, కుండాల, పీచి వంటి 10 డ్యామ్‌లకు రెడ్ అలర్ట్, మరో ఎనిమిది డ్యామ్‌లకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు రాజన్ చెప్పారు.
ఇంతకుముందు నదీ పరీవాహక ప్రాంతాలు, తూర్పు పర్వత ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా వివిధ డ్యామ్‌లలో నీటి మట్టాలు పెరగడంతో కొన్ని డ్యామ్‌ల షట్టర్లు ఎత్తివేస్తున్నామని, ఫలితంగా దక్షిణ, మధ్య కేరళలోని నదుల నీటి మట్టాలు పెరుగుతాయని కేరళ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇడుక్కి రిజర్వాయర్‌లో నీటి మట్టం సోమవారం 2,396.96 అడుగుల (పూర్తి సామర్థ్యం 2,403 అడుగులు) కు పెరిగింది. దీంతో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. షోలయార్, పంబ, కక్కి మరియు ఇడమలయార్‌తో సహా వివిధ డ్యామ్‌లలో నీటి మట్టం పెరుగుతున్నందున ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అచ్చంకోవిల్ నది తీర ప్రాంతం పండలం సమీపంలోని చెరికల్, పూళికడు, ముడియూర్‌కోణం, కురంబాల ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అచ్చన్‌కోవిల్‌లో నీటిమట్టం పెరుగుతున్నందున, ఆరన్ముల, కిడంగనూరు, ఓమల్లూరు ప్రాంతాల సమీపంలోని తీర ప్రదేశాలకు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక్కడి ప్రజలను పథనంతిట్ట జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ సహాయక శిబిరాలకు తరలించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ, పునరావాస చర్యలను సమన్వయం చేయడానికి ఏడీజీపీ విజయ్ సఖరేని నోడల్ అధికారిగా నియమించింది. షోలయార్ డ్యామ్‌ను గేట్లను ఎత్తివేయనున్నందున
చాలకుడి నది తీరంలో నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని త్రిశూర్ జిల్లా కలెక్టర్ హరిత వి.కుమార్ సోమవారం ఉదయం కోరారు.
27 మంది మృతి..
ఎడతెరిపి లేకుండా కురిసిన వానల కారణంగా రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి మృత్యువాతపడ్డవారి సంఖ్య సోమవారం నాటికి 27కు పెరిగింది. వీరిలో ఒక్క కొట్టాయం జిల్లా వాసులే 14 మంది. ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అలప్పుజలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం వర్షం తీవ్రత తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. కొండచరియల్లో చిక్కుకుపోయిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.