సహాయ చర్యలు వేగవంతం
. వరద ముంపులోనే లక్షలాది మంది
. బాధితుల్లో విషాదఛాయలు
. ప్రకాశం బ్యారేజీకి, బుడమేరుకు తగ్గిన వరద
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రెండు రోజులుగా విజయవాడను గడగడలాడిరచిన బుడమేరు, కష్ణానది వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద ఉధృతి తగ్గింది. అటు బుడమేరు కూడా శాంతించింది. దీంతో మంగళవారం ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. నిన్న, మొన్న బాధితులకు పెద్దగా అందని ఆహారం, మంచినీరు, పాలు వంటి సదుపాయాలు చాలావరకు బాధితులకు చేరింది. ప్రభుత్వ యంత్రాంగం సైతం సహాయ చర్యలను వేగవంతం చేసింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో బాధితులకు చాలావరకు ఆహారం అందజేసింది. మరోవైపు, సర్వం కోల్పోయిన బాధితులు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. సర్వం కోల్పోయి… ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం సహాయచర్యల్లో పాల్గొని బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. కాగా, వరద ఉధృతి తగ్గినప్పటికీ బాధితులు ఇంకా బురదనీటిలో జీవిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విజయవాడ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది. నాలుగు రోజుల నుంచి వరద ముంపులోనే ప్రజలు అల్లాడుతూ బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి… భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇదే పరిస్థితి ఇప్పుడూ కనిపిస్తోంది. ఇళ్లలోనే చిక్కుకున్న బాధితులు కనీసం కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరణ జరగలేదు. బుడమేరు పరీవాహక ప్రాంతంలో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. బాధితులు సగానికిపైగా ఇళ్లకే పరిమితమయ్యారు. కాలనీలు, రహదారులు చెరువుల్లా తలపించడంతో ఎటూ వెళ్లలేని దుస్థితి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, రోగగ్రస్తులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సరిపడా ఆహార పొట్లాలు సమకూర్చినా… కొన్ని ప్రాంతాల్లో అందజేయలేని పరిస్థితి ఏర్పడిరది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో అంగీకరించారు. ఆహార సరఫరాలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చూపుతోందని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరద ముంపు ప్రభావంలేని ప్రాంతాల వారికి ఆహారం సరఫరా చేయడం, అక్కడ వారు వృథాగా చెత్తలో పోస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. బుడమేరుతో పాటు కృష్ణా పరీవాహక ప్రాంత ముంపులో దాదాపు 4 లక్షల మంది బాధితులు చిక్కుకున్నారు. ఇంకా ఇంట్లో నుంచి బయటకు రాకుండా 3 లక్షల మంది అవస్థలు పడుతున్నట్లు సమాచారం. ఒక్క సింగ్‌నగర్ పరిసర ప్రాంతంలోనే 2.76 లక్షల మంది ఉన్నట్లు అంచనా. విజయవాడ సింగ్‌నగర్, వన్‌టౌన్, వించిపేట ప్రాంతాలు వరద గుప్పెట్లోనే ఉన్నాయి. అజిత్‌సింగ్‌నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద ముంపులోనే ఓ ఇంట్లో మహిళ ప్రసవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద సహాయక చర్యలో నిమగ్నమైన విద్యుత్ లైన్‌మెన్ వజ్రాల కోటేశ్వరరావు కొట్టుకుపోయి మృతి చెందారు. అటు లంక గ్రామాల చుట్టూ వరద నీరు ముంచెత్తింది. ఇప్పటివరకు ముంపు ప్రాంతాల నుంచి కేవలం 43,417 మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు విపత్తుల కేంద్రం వెల్లడిరచింది. మరోవైపు, మున్నేరు వరద ఉధృతికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని లింగాల వంతెన కొట్టుకుపోయింది. దీంతో జగ్గయ్యపేట`ఖమ్మం మధ్య రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్లు పొడవునా గండ్లు పడ్డాయి. విజయవాడ మధురానగర్ సమీపంలోని విజయదుర్గానగర్‌లో బుడమేరు కాల్వకు గండిపడి ఏలూరు కాల్వలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో జేసీబీపై చంద్రబాబు పర్యటించారు. ప్రకాశం బ్యారేజీలో బోట్లు దూసుకొచ్చి గేట్లు దెబ్బతిన్న ప్రాంతాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, పార్టీ ఇతర నేతలు పరిశీలించారు.
కృష్ణానది ఉధృతి తగ్గుముఖం
భారీ వర్షాలు, వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణానది కాస్త శాంతించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతోంది. 11 లక్షల 40 వేల క్యూసెక్కుల నుంచి గంట గంటకు వరద తాకిడి తగ్గుముఖం పడుతోంది. మంగళవారం ఉదయం 8 లక్షల 94 వేల క్యూసెక్కులకు వరద చేరుకుంది. మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. కృష్ణానది శాంతించడంతో బ్యారేజీ దిగువున ఉన్న గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అటు కృష్ణాతీరంలోని గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అనేక గ్రామాలను వరద ముంపు వెంటాడుతోంది. ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల స్వల్పంగా తగ్గటంతో దివిసీమలోని అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకు ముంపు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఏర్పడ్డాయి. నాగాయలంక, శ్రీరామపాద క్షేత్రం ఘాట్ వద్ద అడుగు మేర వరద నీటిమట్టం తగ్గుతోంది. కరకట్టకు సమాంతరంగా నీరు ప్రవహించడంతో నదీ తీర గ్రామాల ప్రజలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక మండలాల్లోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి.