రెండు లక్షల 20 వేల ఎకరాల్లో పంటలు ధ్వంసం
ప్రాథమిక అంచనా నివేదిక అందించిన అధికారులు
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనాకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తోంది. వివిధ శాఖల్లో జరిగిన నష్టంపై బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో దాదాపు రెండున్నర గంటల పాటు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం సమావేశమైంది. జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు వరద పరిస్థితిని తెలిపారు. వరద నష్టం తీవ్రతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలు, ఫోటోలను కేంద్ర బృందానికి చూపించారు. రూ.6,880 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వెల్లడిరచారు. అనంతరం ఏపీఎస్డీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం సందర్శించింది. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి సమగ్ర నివేదికను తీసుకున్న తర్వాత కేంద్ర బృందం రెండు టీమ్‌లుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఒక బృందం గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటిస్తే మరో బృందం కృష్ణా జిల్లాలో పర్యటించింది. సమావేశంలో వ్యవసాయం, హార్టికల్చర్, పశు సంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బీ రోడ్లు, నీటి వనరులు, గ్రామీణ తాగునీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో సంభవించిన నష్టాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కృష్ణా నదికి వరద వచ్చిందని కేంద్ర బృందానికి అధికారులు తెలిపారు. ఏపీలో 32 వార్డులు, రెండు గ్రామాలు, 161 సచివా లయాల పరిధిలో 10.63 లక్షల మంది ప్రభావితం కాగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం (7) జిల్లాలు, 108 మండలాలు, 337 గ్రామాలు ప్రభావితమయ్యాయ న్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లకు వరద పోటెత్తిందని, ప్రాజెక్టులు నిండాయని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా డెల్టా మీదుగా కొల్లేరు సరస్సులో కలిసే బుడమేరు ఉప్పొంగిన కారణంగా విజయవాడ నగర పరిస్థితిని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. బుడమేరుకు సామర్థ్యానికి మించి నీరు రావడం, గండ్లు పడటం, విజయవాడ బ్యారేజ్‌కు రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడం తదితర కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. 2.06 లక్షల హెక్టార్లో వ్యవసాయ పంట, 19,686 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. మూడు లక్షల మంది రైతులు నష్టపోయారన్నారు. రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని తద్వారా వేల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. ఇళ్లలో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు, గృహోపకరణాలకు మరమ్మత్తులు చేయిస్తున్నట్లు వెల్లడిరచారు. తొలిరోజు పర్యటనలో భాగంగా వ్యవసాయశాఖ, రైతు సంక్షేమం సంచాలకులు డా.ఏఎల్ వాగ్మేర్ నేతృత్వంలో ఒక బృందం బాపట్ల, గుంటూరు జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి జరిగిన నష్టాన్ని పరిశీలించింది. బాపట్ల జిల్లా వేమూరు, కొల్లూరు మండలం ఈపురులంక, అరవింద వారథి, పెసర్లంక, నక్కపాయ, పల్లెపాలెంలోని ఓలేరు, రావి అనంతవరం, కనగాలలో పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అనంతరం గుంటూరుకు చేరుకోగా మరో బృందం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం లోని యనమలకుదురులో దెబ్బతిన్న ఆర్ డబ్ల్యూ ఎస్, సీపీ డబ్ల్యూ ఎస్ స్కీంలను పరిశీలించింది. కంకిపాడు మండలంలోని పెదపులిపాక గ్రామంలో దెబ్బతిన్న గృహాలు, ఉద్యాన పంటలను, పెనమలూరు మండలం చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు గ్రామాల్లో పంట నష్టాన్ని సభ్యులు అంచనా వేశారు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో దెబ్బతిన్న కంకిపాడు – రొయ్యూరు రహదారి పరిశీలించారు. ఆపై రోడ్డు మార్గం గుండా పామర్రు మీదుగా గుడివాడ మండలంలోని నందివాడకు చేరుకొని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వ బృందంలో వ్యవసాయశాఖ, రైతు సంక్షేమం సంచాలకులు (మహారాష్ట్ర) డా.వాగ్మేర్, ఉపరితల రవాణాశాఖ చీఫ్ ఇంజనీరు రాకేశ్ కుమార్ (విజయవాడ), ఆర్థిక శాఖ కన్సల్టెంట్ ఆర్‌బీ కౌల్(న్యూదిల్లీ), గ్రామీణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రదీప్ కుమార్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఎస్‌వీఎస్‌పీ శర్మ ఉన్నారు.