ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.25వేలు
చిరు వ్యాపారులకు రూ.25వేలు, లఘు పరిశ్రమలకు లక్ష
పత్తికి రూ.25వేలు, అరటికి రూ.35వేలు
నష్టపరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు సీఎం చంద్రబాబు నష్టపరిహారం కింద ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. సచివాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు బాధితులకు అందజేసే పరిహార వివరాలను వెల్లడిరచారు. వంద రోజుల పాలనలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. వంద సంవత్సరాల చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదలు, బుడమేరుకు వచ్చిన వరదల కారణంగా ప్రజలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.6,880 కోట్లుగా కేంద్రానికి నివేదిక అందజేసినప్పటికీ, వాస్తవస్థితి ప్రకారం నష్టం అంతకంటే ఎక్కువగానే వాటిల్లిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. బాధితులకు ఆదుకునేందుకు అవసరమైన సత్వర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి రూ.25వేలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మొదటి అంతస్తులో ఉండే వారికి రూ.10వేలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు, చిరు వ్యాపారులకు రూ.25వేల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. ద్విచక్రవాహనదారులకు రూ.3వేలు, మూడు చక్రాల వాహనాలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామన్నారు. ఫిషింగ్ బోట్, నెట్ పాక్షికంగా దెబ్బతింటే రూ.9వేలు, పూర్తిగా నష్టపోతే రూ.20వేలు ఇస్తామన్నారు. సెరీ కల్చర్‌కు రూ.6వేలు. పశువులకు రూ.50వేలు. వరి ఎకరాకు రూ.10వేలు, చెరకు పంటకు రూ.25వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే చేనేత కార్మికులకు రూ.15వేలు. ఒక్కో కోడికి రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5వేలు. పశువులకు రూ.50వేలు, ఎద్దులకు రూ.40వేలు. దూడలకు రూ.25వేలు, గొర్రెలకు రూ.7500. హెక్టారు పత్తికి రూ.25వేలు, వేరుశనగకు , హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15వేలు, పసుపు, అరటికి రూ.35వేలు, మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15వేలు చొప్పున ఇస్తామని తెలిపారు. నష్టపోయిన ఎంఎస్‌ఎంఈలకు కూడా ఆర్థిక సహాయం అందజేస్తామని, రూ.40లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న పరిశ్రమలకు రూ.లక్ష, రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వాటికి రూ.1.5లక్షలు ఇస్తామని తెలిపారు. బైక్‌ల బీమా, మరమ్మతులకు సంబంధించి 9వేలకు పైగా క్లెయిమ్‌లు పరిష్కరించామని, ద్విచక్రవాహనదారులు రూ.71 కోట్ల మేర క్లెయిమ్‌లు చేయగా, ఇప్పటికే రూ.6కోట్లు చెల్లింపులు చేయగా, మరో 6వేల క్లెయిమ్‌లు పెండిరగ్‌లో ఉన్నాయని సీఎం వివరించారు.