. మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచాలి
. వార్డెన్, కుక్, వాచ్‌మెన్ పోస్టులు భర్తీ
. జీవో 77 రద్దు చేయాలి
. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం
. రాష్ట్రవ్యాప్తంగా ఏఐఎస్‌ఎఫ్ ఆందోళనలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, వార్డెన్, కుక్, వాచ్‌మెన్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేయాలని, పరిశుభ్రత పాటించాలని తదితర డిమాండ్‌లతో కూడిన ప్లకార్డులు చేతబూని విద్యార్థులు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాల యాల ఎదుట ఆందోళనలు చేపట్టారు. ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. తిరుపతిలో కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ కార్యదర్శి దినేశ్ శ్రీరంగరాజన్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతి, పౌష్టిక ఆహారం కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. అన్న క్యాంటీన్లో పెడుతున్న భోజనం మూడు పూటలకి రూ.90 ఖర్చు అవుతుందని చెపుతున్న ప్రభుత్వం, వసతిగృహ విద్యార్థులకు 53 రూపాయలు ఏ విధంగా సరిపోతాయో ఆలోచించాలన్నారు. మెస్ ఛార్జీలు రూ.2,500కు పెంచాలన్నారు. శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయిబర్స్‌మెంట్ వచ్చే విధంగా చూడాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్, ప్రవీణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి వినయ్, నగర నాయకులు మోహన్, ఆనంద్ ,కిషోర్, శివ ,రాజు పాల్గొన్నారు.
విద్యార్థినులకు ప్రత్యేక సౌకర్యాలు: జాన్సన్‌బాబు
ఏఐఎస్‌ఎఫ్ విశాఖ జిల్లా సమితి అధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో ట్రంకుపెట్టెలు, కూరగాయలతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీ జాన్సన్ బాబుబాబు మాట్లాడుతూ పెరిగిన ధరలకనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. వసతిగృహాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళా వసతి గృహాల్లో భద్రతతో పాటు, వారికి ప్రత్యేక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి మెనూ సక్రమంగా అమలు చేయని వార్డెన్‌లు, తనిఖీలు చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కార్యదర్శి. యు.నాగరాజు, జిల్లా అధ్యక్షుడు ఎన్. శ్రీను, జిల్లా సమితి సభ్యులు శేఖర్, గ్రేస్ ప్రకాష్, కిరణ్, మధు, యేసయ్య, నూతన్ ప్రసాద్, దివ్య పాల్గొన్నారు. అలాగే, రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో నిరసన దీక్షలు కొనసాగాయి.