. కేంద్ర సాయంపై సమాచారం లేదు
. విపత్తుకు 28 మంది మృతి
. బుడమేరు గండ్లు పూడ్చడమే ప్రధాన లక్ష్యం
. ముంపు ప్రాంతాల్లో ఉచిత బస్సు సర్వీసులు
. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తెలుగురాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ తక్షణ సహాయంపై తనకు ఎటువంటి సమాచారం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ప్రాథమిక సహాయంగా రూ.3,300 కోట్లు కేటాయించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు రావడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ట్వీట్ చేసిన అంశాన్ని మీడియా చంద్రబాబు దృష్టికి తీసుకురాగా… తనకు సమాచారం రాలేదని తెలిపారు. కేంద్రానికి ఇంకా ప్రాథమిక నివేదికలే పంపలేదు. వరద నష్టం అంచనాపై శనివారం ఉదయం ప్రాథమిక నివేదిక పంపుతాం. బాధితులకు సాయంపై కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించా. ప్రస్తుతం పై నుంచి ప్రవాహం రావడం లేదు. ముంపు ప్రాంతాల్లో క్రమంగా నీరు తగ్గుతోంది. ముందు బుడమేరు గండ్లు పూడ్చాలన్నదే మా లక్ష్యం. బుడమేరు మూడో గండి పూడ్చేందుకు సైన్యం వచ్చింది. మూడో గండిని ఇవాళ రాత్రికి పూడ్చాలని సర్వశక్తులు ఒడ్డుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఏరియల్ సర్వే అనంతరం శుక్రవారం సాయంత్రం విజయవాడ కలెక్టరేట్ వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వరదల వల్ల రాష్ట్రంలో 28 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలో సామగ్రి నష్టానికి ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నాం. సహాయ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాం. 149 అర్బన్, 30 రూరల్ సచివాలయాల నుంచి పనులు చేపట్టాం. 3.12 లక్షల ఆహార పొట్లాలు, 11.5 లక్షల వాటర్ బాటిళ్లు, పాలు, బిస్కెట్లు, కొవ్వొత్తులు పంపిణీ చేశాం. నీరు నిల్వ ఉన్న చోట తప్ప మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. వరద ప్రాంతాల్లో 72 శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేశాం. 7,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. 1,300 పీడీఎస్ వాహనాలు తిరుగుతున్నాయి. ప్రతి కుటుంబానికి నిత్యావసరాల కిట్ ఇస్తున్నాం. మూడ్రోజుల్లో అందరికీ అందుతాయని సీఎం వివరించారు. ఏరియల్ సర్వే నిర్వహించి కొల్లేరు వరకూ వెళ్లి తర్వాత బుడమేరును అధ్యయనం చేశామని, కృష్ణానదికి వస్తున్న వరదపై క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వివరించారు. ముందు బుడమేరు బ్రీచ్ క్లీన్ చేయాలని, అప్పుడే తాము చేసే పనికి సార్థకత అవుతుందని తెలిపారు. మూడు బ్రీచ్‌లలో రెండు మూసుకుపోయాయని చెప్పారు. ఇంకా ఒక్కటి ఉందని చెప్పారు. నిన్న 9 వేల క్యూసెక్కుల నీరు వచ్చిందని, ఇప్పుడు తగ్గి 3000 క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. ఈ రాత్రికి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనైనా తొలగించేలా పనులు పూర్తిచేస్తామని అన్నారు. అయితే ఈరోజు రాత్రికి వర్షం పడితే మరలా బుడమేరుకు పై నుంచి నీరు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. 32 వార్డులను డివిజన్‌ల కింద విభజించి అక్కడ ఉన్న వారికి సమాచారం ఇస్తున్నామని వెల్లడిరచారు. 224 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించామని, 24 ట్యాంకులు శానిటేషన్‌కు వాడుతున్నామని వెల్లడిరచారు. ప్రజలు పైప్ కనెక్షన్‌ల నుంచి వచ్చే తాగు నీటిని ఇంకా రెండు రోజుల పాటు వాడొద్దని, పైపుల్లో బురద నీరు వచ్చే అవకాశం ఉండటంతో వాడొద్దని సూచించామని అన్నారు. భారీ వర్షాలతో పాడైన 490 కిలో మీటర్లు రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నట్లు వివరించారు. అలాగే భారీ వర్షాలతో వరదలతో నిండిపోయిన 10వేల ఇళ్లను ఇప్పటికే శుభ్రం చేశామని…. రాత్రికి మరో 15వేల ఇళ్లను శుభ్రం చేస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, 161 పవర్ బోట్లు ఇంకా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రానున్న మూడు రోజుల్లో 100 శాతం మందికి చేయాల్సిన సాయం చేస్తామని, వరదల నుంచి విజయవాడకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.