. కార్పొరేట్ తరహా ప్రణాళిక
. ప్రతి వారం, యూనిట్, త్రైమాసిక, అర్ధ, ప్రీ పబ్లిక్
. ఇంటర్ బోర్డు ప్రత్యేక క్యాలెండర్ రూపకల్పన
. ‘మౌలిక’ లేమితో విద్యార్థుల్లో సామర్థ్యం మెరుగయ్యేనా?
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇంటర్ విద్యార్థులకు పరీక్షలే పరీక్షలు. వారంవారం పరీక్షలు తప్పనిసరి. వాటితోపాటు ప్రతినెలా యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, అర్ధ, ఆ తర్వాత ప్రీ ఫైనల్ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధులు కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షల ప్రక్షాళనకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. యూనిట్ నుంచి ప్రీ ఫైనల్ పరీక్షల వరకూ అన్ని కళాశాలల్లోనూ ఒకే విధానం తీసుకురానుంది. గతంలో కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనే ప్రతి వారం, నెలనెలా పరీక్షల విధానం కొనసాగేది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రం ప్రీ పబ్లిక్, ఆ తర్వాత బోర్డు పరీక్షలను మాత్రమే నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం పరీక్షల విధానంలో ఇంటర్‌బోర్డు పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పరీక్షల సమూల మార్పులకు, ప్రక్షాళనకు బోర్డు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఎవరికి వారే అన్నట్లుగా కళాశాలల స్థాయిలో అంతర్గత పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా కళాశాలలను నిర్దేశించకున్న పాఠ్యంశాలపై వారే నిర్ణయించుకున్న తేదీల్లో పరీక్షలు కొనసాగేవి. పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు ఏ విద్యార్థి సామర్థ్యంపై స్పష్టత వచ్చేదీ కాదు. చదువులో వెనుకబాటుకు గురైన విద్యార్థుల గుర్తింపును అంచనా వేయలేపోయారు. ఇంటర్‌లోనూ సంక్షిప్తంగా అకడమిక్ క్యాలెండర్ తయారు చేస్తున్నారు. అంతర్గత పరీక్షలు కామన్‌గా నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇకపై ఒకే సిలబస్, ఒకే తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే దీనిపై ఇంటర్ విద్యామండలి అధికారులు టైమ్ టేబుల్‌ను రూపొందించారు. ఈ విధానాలు విద్యార్థుల సామర్థ్యం మెరుగుకు ఇవి దోహదపడతాయని భావిస్తున్నారు. ఈ విధానాలతో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకూ అద్దూ, అదుపు లేకుండా పోతుందన్న విమర్శలున్నాయి. ఇదే అదునుగా పరీక్షల పేరుతో విద్యార్థులపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కార్పొరేట్ కళాశాలల్లో ప్రత్యేక పుస్తకాలు
కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌తోపాటు జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూలు వచ్చేంత వరకూ జేఈఈ, నీట్ సిలబస్‌పైనే తరగతులు కొనసాగించి, ఆ తర్వాత ఒక నెల రోజులపాటు ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తారు. ఈ విధానం కొన్ని పేరొందిన కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. విద్యార్థులు అటు పోటీ పరీక్షల సిలబస్, ఇటు ఇంటర్ పరీక్షల సిలబస్‌తో మానసిక ఒత్తిడికి గురయ్యేవారు. ఆదివారంతోపాటు సెలవు దినాల్లోనూ జేఈఈ, నీట్ వారంతరపు పరీక్షలను నిర్వహిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకైతే ఇక ఉదయం నుంచి రాత్రి వరకూ చదువుల ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలికి నిబంధనల ప్రకారం తెలుగు అకాడమీ పుస్తకాల సిలబస్‌తో విద్యార్థులకు అక్కడ బోధించడం లేదు. ఆయా కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రత్యేకంగా జేఈఈ, నీట్‌తోపాటు ఇంటర్ సిలబస్‌తో ఇంటిగ్రేటెడ్ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాయి. ఈ పుస్తకాలకు ప్రతిఏటా రూ.10 వేల చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పోలిస్తే… కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే విస్తృతంగా ప్రామాణిక మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు జేఈఈ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లోను, ఇంటర్ మార్కుల శాతంలోను అత్యధికంగా రాణించలేకపోతున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల కంటే, రెండు నెలల ముందే కార్పొరేట్ కళాశాలలు తరగతులను ప్రారంభించాయి. ఆయా విద్యార్థులకు ఇంటర్, జేఈఈ, నీట్ ఇంటిగ్రేటెడ్ బోధన కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు బోర్డు నుంచి వారం, నెల, త్రైమాసిక, అర్థసంవత్సర పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదీ క్షేత్రస్థాయిలో అధికారులు అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ కళాశాలల్లో అత్యధికంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుతుంటారు. ఇంటర్‌బోర్డు నిర్వహించబోయే పరీక్షల్లో వెనుకబాటుకు గురైన వారిపై శ్రద్ధచూపి, వారికి ప్రత్యేక బోధన చేపడితేనే మెరుగైన ఫలితాలకు ఆస్కారముంటుంది.
వెంటాడుతున్న అధ్యాపకుల కొరత
ఏపీలో 476 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులతో పాటు కొన్ని వృత్తి విద్యా కోర్సులున్నాయి. దాదాపు రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. చాలా కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. ్ల లైబ్రరీ, గ్రౌండ్ సౌకర్యాలు లేవు. పార్ట్‌టైమ్ విధానంలో లెక్చరర్లు బోధిస్తున్నారు. సైన్స్ గ్రూప్‌లకు ప్రయోగశాలలు కరవుయ్యాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు లెక్చరర్ల కొరత ఉంది. ఖాళీలను భర్తీ చేయకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం పరీక్షల విధానంలో నూతన మార్పులు తీసుకురావడం వల్ల ఎంత వరకు ఫలితాలు వస్తాయనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే యూనిట్-1 పరీక్షల నిర్వహణలో కళాశాలలు నిమగ్నమయ్యాయి. యూనిట్-2 నుంచి కళాశాలలు ఒకే సిలబస్ ఉండేలా నూతన విధానం అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు కళాశాలలే ప్రశ్నపత్రాలు తయారు చేస్తుండగా, ఇకపై ఇంటర్ బోర్డే అన్ని పరీక్షలకు ప్రశ్నపత్రాలను తయారు చేస్తుంది. పరీక్షలు జరిగే రోజు ఉదయం ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు పేపర్లను బోర్డు నుంచి పంపుతారు. ఈ విధానం ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు దోహదపడుతుందా లేక కార్పొరేట్ కళాశాలలను మరింత ప్రోత్సహించేలా దారితీస్తుందా అనే అనుమానాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి.