. భారత్‌కు బొగ్గు దిగుమతులు ఆగేదెప్పుడు
. రాజ్యసభలో సీపీఐ ఎంపీ సంతోశ్ కుమార్
న్యూదిల్లీ : బొగ్గు దిగుమతులు ఆగేది ఎప్పుడు? విద్యుత్ విధానాన్ని అదానీ సంస్థ శాసిస్తోందా? అని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎంపీ సంతోశ్ కుమార్ ప్రశ్నించారు. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడంలో విరుద్ధమైన వైఖరిని కేంద్రం అనుసరిస్తోందని విమర్శించారు. కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ)పై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును సంతోశ్ కుమార్ దుయ్యబట్టారు. ఒక వైపు కొత్త, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం గురించి మాట్లాడుతోన్న సర్కార్… మరోవైపు సంప్రదాయ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని అన్నారు. ‘ఇప్పటికే పవర్ బాస్కెట్‌లో బొగ్గువాటా 50శాతంగా ఉంది. బొగ్గు ప్లాంట్ల సామర్థ్యం పెరుగుతోంది. 13.9గిగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంటే బొగ్గు ఉత్పత్తిని, అదానీని ప్రోత్సహిస్తున్నారు. దీనిని బట్టి విద్యుత్ విధానాన్ని అదానీ సంస్థ శాసిస్తోందా అన్న అనుమానం కలుగుతున్నది’ అని సంతోశ్ కుమార్ అన్నారు. రాబోయే సంవత్సరాల్లోనూ బొగ్గు దిగుమతులు కొనసాగుతాయని అదానీ సంస్థ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలా ఎలా చెప్పగలరు? ఈ పద్థతిలో బొగ్గు దిగుమతులను ప్రోత్సహించవచ్చా? అని కేరళ ఎంపీ ప్రశ్నించారు. బొగ్గు దిగుమతులను భారత్ నిలిపివేసేది ఎప్పుడని నిలదీశారు. దేశంలో కొత్తగా బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పుకుంటూ పునరుత్పాదక ఇంధనం గురించి మాట్లాడుతుండటం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వ్యవహారంలో మంత్రిత్వశాఖ ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరమని సంతోశ్ కుమార్ హితవు పలికారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన గురించి ఎన్‌సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్ మాట్లాడారు. ఉచిత సౌర విద్యుత్… సబ్సిడీ ఆధారిత పథకమని, ఇందులో ఉచితమేమీ లేదని తెలిపారు. విద్యుత్ సరఫరాకు విఘాతం కలిగే ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది కానీ రైతులు ముందుగా బ్యాంకులకు వెళ్లి రుణాల కోసం దరఖాస్తు పెట్టుకోవాలి… ఆ తర్వాతే సబ్సిడీ మంజూరవుతుందన్నారు. బ్యాంకు రుణాలు పొందడం రైతులకు కష్టంగా మారిందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉచిత సౌర విద్యుత్ పథకం… కాగితాలకే పరిమితమని ఫౌజియా ఖాన్ వ్యాఖ్యానించారు. ఐయూఎంఎల్ సభ్యులు హారిస్ బీరన్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగ వ్యయాన్ని భరించలేని ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా సౌర యోజన ఉండాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వ సహకారాన్ని పెంచాలని సూచించారు. సాధారణంగా ఇంటికి మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రూ.3లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇందుకు లభించే సబ్సిడీ తక్కువని, దాన్ని 50శాతానికి పెంచితే ఉపయుక్తంగా ఉంటుందని హారిస్ బీరన్ అభిప్రాయపడ్డారు. సౌర ప్రాజెక్టుల్లో అరుణాచల్ ప్రదేశ్, లఢాక్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఏజీపీకి చెందిన బీరేంద్ర ప్రసాద్ భాష్య కోరారు. ఈ ప్రాంతాల్లో ఏడాది పొడవూ సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుందని తెలిపారు. మహారాష్ట్రకు మంజూరైన పునరుత్పాదక ప్రాజెక్టుల్లో చాలా ప్రారంభానికి నోచుకోలేదని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. తమిళనాడు తీరప్రాంతానికి వాయుశక్తి ఉత్పాదన సామర్థ్యం ఉన్నట్లు ప్రభుత్వ దృష్టికి ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై తీసుకెళ్లారు. చర్చలో బీజేడీ, బీజేపీ సభ్యులు పాల్గొన్నారు.