పదేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులు రూ.35,491 కోట్ల్లే
ఇప్పటికీ ఆచరణకు నోచుకోని అనేక హామీలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు అమలు చేయలేదు. వివిధ పద్దుల కింద ఇవ్వాల్సిన నిధులు కూడా అరకొరగా విదిలించడమే తప్ప… ఏ ఒక్క పథకానికి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయలేదు. విజయవాడకు చెందిన ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారానికి కేంద్ర ఆర్థికశాఖలోని ఖర్చుల విభాగం వెల్లడిరచిన వివరాలు పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమైంది. విభజన చట్టం కింద పదేళ్లలో రూ.35,491 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడిరచింది. ఏపీఆర్‌ఏ చట్టంలోని రిసోర్స్ గ్యాప్ కింద రూ.16,078 కోట్లు, ఆర్థికంగా వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని ఏడు జిల్లాలకు 2014 నుంచి 2020 వరకూ కేవలం రూ.1,750 కోట్లు మాత్రమే ఇచ్చారు. అమరావతి రాజధాని పేరుతో మౌలిక సదుపాయాల కోసం రూ.2,500 కోట్లు, పోలవరానికి రూ,15,147 కోట్లు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. ప్రత్యేకసాయం కింద 2018-19లో, ఈఏపీ ప్రాజెక్టుల కింద 2015-20 మధ్య రుణానికి సంబంధించి వడ్డీ కింద రూ.15.18 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొంది. మొత్తంగా ఏపీకి విభజన అనంతరం పదేళ్లలో రూ.35,491.57 కోట్ల నిధులు ఇచ్చినట్టు ఆర్టీఐ సమాచారంలో కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని విభజన హామీల్లో పేర్కొనగా, ఆచరణలో మాత్రం జిల్లాకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే విడతలవారీగా విడుదల చేసింది. అలాగే విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధానికి రైలు మార్గం, విజయవాడ, విశాఖలో మెట్రో రైలు వంటి అనేక హామీలు అమలుకు నోచుకోలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉండగా ప్రాజెక్టుకు అయ్యే రూ.56 వేల కోట్ల మొత్తం ఖర్చులో ఇప్పటివరకు ఇచ్చిన నిధులు కేవలం రూ.15,147 కోట్లు మాత్రమే. ఇక అమరావతి రాజధాని పరిస్థితి అయితే మరింత దయనీయం.
సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని గత పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే ఉంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ విద్యా, వైద్య సంస్థలకు సైతం పదేళ్లు పూర్తయినా ఇంతవరకు పూర్థిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం.