. ‘ప్రైవేటు’కు దీటుగా ప్రభుత్వ బడులు
. త్వరలో నైపుణ్య గణనపై సర్వే
. విద్యాశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశిం చారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చుచేస్తోందని… క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలన్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అగుణంగా, భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని సిలబస్ లో మార్పులు చేయాలని, ఇందుకోసం విద్యా రంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీిఎం సూచించారు. సచివాలయంలో మంగళవారం సీఎం విద్యాశాఖపై సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వచ్చే 10-20 ఏళ్లకు ఏమి అవసరమో గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని, ప్రచార ఆర్భాటం కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలని సీఎం అన్నారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు…బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదని…ఈ విషయంలో కఠినంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడాలని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరు 100 శాతం ఉండాలని, డిగ్రీ వరకు వరకు అది కొనసాగేలా పర్యవేక్షించాలన్నారు. ప్రైవేటు స్కూళ్ల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. కర్నూలు జిల్లాలో వలస కార్మికుల పిల్లలు స్కూళ్లకు దూరం అవుతున్నారని అధికారులు చెప్పగా, వారిని రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించి విద్యను అందించాలని సూచించారు. స్కూళ్లలో ఇంగ్లీష్ తో పాటు మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తెచ్చి ప్రోత్సహించింది గత తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ కూడా ఇవ్వాలని, త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఎవరైనా పాఠశాలలు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలని చెప్పారు. 2014-19 మధ్య విద్యావ్యవస్థలో ప్రధాన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఏటా ప్రతిభా అవార్డులు అందించామని… గత ప్రభుత్వం రద్దు చేసిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఇదొక స్ఫూర్తిగా ఉంటుందని సీఎం చెప్పారు. అనంతరం స్కిల్ డెవలప్‌మెంట్ పై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల్లో 3.54 కోట్ల మంది పనిచేసే వయసు ఉన్న ప్రజలు ఉన్నారని, వారి నైపుణ్యాన్ని గణన చేయడం కోసం 40 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరం ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. బేసిక్ స్కిల్ ప్రొఫైల్, డొమైన్ స్కిల్స్, క్రాస్ ఫంక్షనల్ స్కిల్స్ పై గణన చేయాలని… డోర్ టు డోర్, మీ సేవ కేంద్రాలు, విద్యా సంస్థలు, మొబైల్ యాప్ వంటి 4 విధానాల ద్వారా స్కిల్ సెన్సస్ చేయవచ్చని ప్రతిపాదించారు. దీనిపై పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కూడా సంప్రదించి నైపుణ్య గణన కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం సూచించారు. మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలు, సంస్కరణల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఒక క్లాసుకు ఒక టీచర్ అనే విధానం అమలుచేస్తున్నామని తెలిపారు. టీచర్లపై అనవసరపు ఒత్తిడి తేవడం వల్ల ఉపయోగం ఉండదని, అందుకే ఉపాధ్యాయులపై యాప్ ల భారం తగ్గించామని వివరించారు.