నారా లోకేశ్
విశాలాంధ్ర-విశాఖ సిటీ: విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వమని మంత్రి నారా లోకేశ్ హామీనిచ్చారు. ఇప్పటికే ఈ విషయాంలో తమ పార్టీ తరపున స్పష్టత ఇచ్చినట్లు తెలిపారు. విశాఖ ఉక్కు విషయంలో అసలు చర్చ జరగలేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదని, తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. అదే సమయంలో తిరుమల లడ్డూ వివాదాన్ని ప్రస్తావించారు. సిట్ దర్యాప్తుతో అన్ని విషయాలు బయటకు వస్తాయని లోకేశ్ తెలిపారు. విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అనేక డేటా కంపెనీలతో గతంలో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. రాబోయే వంద రోజుల్లో ఐటీ, జీసీసీ విధానాన్ని తెస్తామన్నారు. లోకేశ్ బుధవారం స్థానిక హోటల్‌లో జరిగిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అనేక ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. విశాఖలోని ఓ ఐటీ కంపెనీలతో సమావేశమై దానికున్న సమస్యలు పరిష్కరించినట్లు వెల్లడిరచారు. ఒక కంపెనీ 1500 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించనుందని, మరో ఐదేళ్లలో 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ చెప్పారు. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఓ కంపెనీ ముందుకొస్తే… గత వైసీపీ ప్రభుత్వం చెడగొట్టిందని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చించలేదని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని చెప్పారు. భవిష్యత్ ప్రాజెక్టులతో పాటు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం, రోడ్డు, మెట్రో అనుసంధానం వంటి అంశాలపై సదస్సులో చర్చించినట్లు తెలిపారు. అభివృద్ధి` వికేంద్రీకరణలో భాగంగా ఒక్కో జిల్లాకు ఫోకస్ ఏరియాలను గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ఈడీబీ(ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు)ని పునరుద్ధరించామని లోకేశ్ వెల్లడిరచారు.