జగన్‌పై సీఎం చంద్రబాబు ధ్వజం
ముంపు ప్రాంతాల్లో 9వ రోజూ పర్యటన
అన్నివిధాలా ఆదుకుంటామని బాధితులకు భరోసా
రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ విస్తృతంగా పర్యటించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు.
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ విస్తృతంగా పర్యటించారు. బాధితులతో మాట్లాడి ఓదార్చారు. వరద పరిస్థితులపై కలెక్టరేట్ లో ఉన్నతాధికారులతో మాట్లాడిన అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. భవానీపురం నుండి సితార సెంటర్ మీదుగా ఊర్మిళా నగర్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను పరిశీలించారు. అనంతరం కబేళా సెంటర్ లో స్థానిక మహిళలతో మాట్లాడారు. వరద ప్రభావంతో తాము అన్నీ కోల్పోయామని, తమకు ఉపాధి చూపించాలని మహిళలు సీఎంను కోరారు. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని, ఉపాధి కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ ఫ్లై ఓవర్ వద్దకు చేరుకొని, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి నుండి మిల్క్ ప్రాజెక్ట్, చిట్టి నగర్, ఎర్రకట్ట మీదుగా మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ కు వెళ్లారు. సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద బాధిత ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం నుండి అందుతున్న సహాయం గురించి ఆరా తీశారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. రూ.పదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి జగన్ గద్దె దిగిపోయారు. వచ్చి ఈ బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతయినా పోయేవి. కానీ బాధితులకు ఎటువంటి సహాయం చేయకపోగా… బెంగళూరులో కూర్చొని మాపై బురద జల్లుతున్నారు. ఇంత పెద్ద మహా యజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారికి ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తాం’’ అని సీఎం వారికి భరోసా ఇచ్చారు. అర్బన్ యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచుతా మన్నారు. సర్వస్వం కోల్పోయిన వారికి జత బట్టలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆప్కో, ఇతర సంస్థల వద్ద వస్త్రాలు తెచ్చి పంపిణీ చేస్తామన్నారు. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. అధిక వర్షాలు, గత పాలకుల పాపాలు ఇప్పుడు ప్రజలకు శాపంగా మారిందన్నారు. బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు వెళ్లకుండా కబ్జాలు చేశారన్నారు. సర్వశక్తులు ఒడ్డి ప్రజలను ఆదుకున్నామని… వైసీపీ నాయకుల అనుచరులకు చెందిన భారీ బోట్లు వరద సమయంలో నదిలోకి ఎలా వచ్చాయని, బోట్లకు లంగరు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ప్రతి రోజు మాపై విషం చిమ్ముతున్నారని, అయినా తనకు 7 లక్షల మంది వరద బాధితుల కష్టాలే కనిపిస్తున్నాయన్నారు. వరద బాధితులకు మనోధైర్యం ఇవ్వాలనేదే తన లక్ష్యమని, వరద ప్రాంతాల్లోని ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలను కూడా మరమ్మతు చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. అనంతరం అక్కడి నుండి కలెక్టరేట్ వెళ్లి అధికారులతో సమీక్షించారు.