జనసేనలోకి బాలినేని, సామినేని… 22న ముహూర్తం
పవన్ కల్యాణ్‌తో భేటీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇద్దరు కీలక నేతలు జనసేన లోకి వెళ్లేందుకు రంగం సిద్ధ మైంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయగా… ఆయనకు మరో సీనియర్ నేత సామినేని ఉదయభాను తోడయ్యారు. గురువారం మంగళగిరి జనసేన కార్యాలయంలో ఒకరి తర్వాత ఒకరు పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక విషయంపై స్పష్టత ఇచ్చారు. కాగా పవన్ కల్యాణ్‌ను వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కలవడం వైసీపీకి భారీ షాక్‌గా మారింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు ఆయన వెల్లడిరచారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉదయభాను పార్టీలో కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో రెండు విడతలుగా నిర్వహించిన మంత్రివర్గ విస్తరణలోనూ సామినేనికి చోటు దక్కలేదు. అప్పటినుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పవన్‌ను కలిసిన అనంతరం సామినేని మీడియాతో మాట్లాడుతూ… వైసీపీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, నా మనసుకు కష్టం కలగడంతోనే పార్టీని వీడినట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తానెంతో సన్నిహితంగా పనిచేశానని, అదే అంకితభావంతో ఆయన కుమారుడైన వైసీపీ అధినేత జగన్‌తో కలిసి నడిచానని గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు అనేకసార్లు జగన్‌ను కలిసి పార్టీ పరిస్థితిని చెప్పినప్పటికీ పట్టించుకోలేదని, వైసీపీలో పరిణామాల్ని చూస్తే ఆ పార్టీకి భవిష్యత్తు లేదనిపిస్తోందన్నారు. మా భవిష్యత్తు మేము చూసు కోవాలనే బయటకి వచ్చామని, పవన్ కల్యాణ్‌తో కలిసి అన్ని విషయాలు చర్చించామన్నారు. ఈనెల 22న బాలినేని శ్రీనివాసులురెడ్డి, సామినేని ఉదయభాను జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని సామినేని తెలిపారు.
జగన్‌కు విశ్వసనీయత లేదు: బాలినేని
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి విశ్వసనీయత లేదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను గెలిపించాలని ఆనాడు రాజీనామాలు చేశామని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను జగన్‌రెడ్డి మరిచిపోయారని ధ్వజమెత్తారు. సభల్లో జగన్ ఎప్పుడూ తన గురించి మాట్లాడలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ పవన్ కల్యాణ్ తన గురించి మాట్లాడారని ప్రశంసించారు. తనపై పవన్ ఎంతో అభిమానంతో ఉన్నారని కొనియాడారు. పవన్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.