విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ రాజీనామాలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. వారి రాజీనామాలతో శాసన మండలిలోనూ వైసీపీ బలం తగ్గుముఖం పట్టనుంది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రాజీనామా బాట పట్టారు. వాటి నుంచి వైసీపీ కోలుకోకముందే మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా బాటలో ఉన్నట్లు ప్రచారం ఉంది. జాతీయ మత్స్యకార మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలిగా పని చేసిన కర్రి పద్మశ్రీ గతంలో వైసీపీలో చేరారు. మార్చి 2023లో జరిగిన ఎన్నికలకు గవర్నర్ కోటా నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. తిరుపతి లోక్‌సభ నుంచి 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు… బల్లి కళ్యాణ్ చక్రవర్తి 2021లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. ఎమ్మెల్సీలు కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామాలకు గల కారణాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.