టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, సీఎం చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేతలకు నిరాశ ఎదురైంది. బుధవారం హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాగా… బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేసి… తమకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు కోరారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని వైసీపీ నేతల తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని టీడీపీ న్యాయవాదులు వాదించారు. అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు తుది ఉత్తర్వులు తొలుత మధ్యాహ్నం ఇస్తామని పేర్కొంది. అనంతరం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తీర్పు చెప్పింది. 2021 అక్టోబరు 19న జరిగిన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పోలీసులు తూతూమంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఈ కేసుపై దృష్టి సారించారు. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులు క్రైం నెంబర్ 650/2021గా కేసు నమోదు చేశారు. ఐపీసీ 307 సెక్షన్‌తో పాటు మరికొన్ని సెక్షన్లు జోడిరచారు. ఐపీసీ 147,148, 452, 427, 323, 324, 506, 326, 307, 450, 380, రెడ్‌విత్ 109, 120బి, 149 తదితర సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం 106 మందికి టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. 21 మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. మిగతా 85 మందికి మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నెల 19 నుంచి నోటీసులు జారీ చేశారు. వీరిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితోపాటు విజయవాడకు చెందిన వైసీపీ నేత దేవినేని అవినాశ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, అరవ సత్యం వంటి ముఖ్య నేతలున్నారు. నాటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో మాజీమంత్రి జోగి రమేశ్ తదితరులున్నారు.