ముంబై: పరువు నష్టం కేసులో శివసేన-యూబీటీ ముఖ్య నేత సంజయ్‌రౌత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పునిచ్చింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయనకు రూ.25 వేలు జరిమానాతో పాటు 15 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత కిరీట్ సోమయ్య కుటుంబసభ్యులు ఓ స్వచ్ఛందసంస్థను నడుపుతున్నారు. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.100 కోట్ల టాయిలెట్ స్కామ్ జరిగిందని సంజయ్‌రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీటిని ఖండిరచిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ ఎటువంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు.