అలాంటి వారికే రాజధానిలో భూములు
. జీవో నం.207 ప్రకారమే సీఆర్డీఏ పరిధి
. రాజధాని రైతులకు మరో ఐదేళ్ల కౌలు పొడిగింపు
. అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సంపద సృష్టికి కేంద్రాలుగా అమరావతి ప్రాంతాన్ని మార్చేవారికే భూ కేటాయింపులు జరపాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. రాజధాని ప్రాంతంలో గతంలో జరిపిన భూ కేటాయింపులపై పునః సమీక్ష ఆసక్తి చూపే, పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం ఇవ్వాలన్నారు. 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే సీఆర్డీఏ ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణం ప్రకారమే సీఆర్డీఏ పరిధి కొనసాగుతుందన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. గతంలో భూములు పొందిన వాళ్లు మళ్లీ ఎన్నిరోజుల్లో నిర్మాణాలు చేపట్టాలి అనే అంశంపైనా చర్చించారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలును, అలాగే రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు అందిస్తున్న పెన్షన్లు కూడా మరో ఐదేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు ఎటువంటి సంస్థలను ఆహ్వానించాలి, ఎవరికి భూములు కేటాయించాలి అనే అంశంపైనా సీఎం చర్చించారు. దేశంలో టాప్ 10 కళాశాలలు, టాప్ 10 పాఠశాలలు, టాప్ 10 ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలని సీఎం అభిప్రాయపడ్డారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిపిన వివిధ గ్రామాలను మళ్లీ రాజధాని పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గత ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై లోతైన సమీక్ష జరుపుతున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ఆర్ 5 జోన్‌పైనా అధికారులు చర్చించారు. గత ప్రభుత్వం చట్టవ్యతిరేక నిర్ణయాలపై లోతైన సమీక్ష జరపాలని అధికారులు పట్టుబట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, 4 లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అనంతరం మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖామంత్రి నారాయణ మీడియాకు సీఆర్డీఏ అథారిటీ నిర్ణయాలు వెల్లడిరచారు.
ఎక్సైజ్‌లో గత ప్రభుత్వ అక్రమాలపై సీఐడీ విచారణ
సీఎం చంద్రబాబు సచివాలయంలో ఎక్సైజ్ శాఖపైనా సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నందున గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీలపై అన్ని ఫైళ్లు సీజ్ చేయాలని, త్వరలో ప్రారంభమయ్యే సీఐడీ విచారణకు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని ఆదేశించారు. ఊహించని స్థాయిలో ఐదేళ్లలో మద్యంలో అక్రమాలు జరిగాయని, దీనిపై అన్ని లావాదేవీలు సీఐడీకి అందించాలన్నారు. ప్రజల ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇక రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఎన్నికల్లో చెప్పినట్లు నాణ్యతలేని మద్యం రాష్ట్రంలో లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పారు. మద్యం సేవించేవారితో మాన్పించడం సాధ్యం కాకపోయినప్పటికీ, తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే నాణ్యత మద్యం లేకుండా చేస్తే కొంత వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా రేట్లు పెంచి పేదలను దోచుకుందన్నారు. నాటి మద్యం ధరలు భరించలేక చాలా మంది గంజాయి, కల్తీ మద్యం, నాటుసారా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నారని చెప్పారు. ఇష్టారీతిన పెంచిన ధరలు పేదల జీవితాలను మరింత నాశనం చేశాయని, ఆ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. తమకు వచ్చిన ఆదాయాన్నంతా పేదలు మద్యానికే ఖర్చు చేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. దీనివల్ల వారి కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ధరలు పెంచి పేదవాడిని దోచుకున్న విధానానికి స్వస్తి పలకాల్సిందేనని స్పష్టం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త మద్యం విధానం రూపొందించాలని ఆదేశించారు. దీని కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.