నవంబరు మొదటివారం నాటికి ప్రక్రియ పూర్తి: నిమ్మల
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : త్వరలో సాగునీటి సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందని, నవంబరు మొదటి వారం నాటికి ప్రక్రియ కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి జీవో విడుదల చేసామన్నారు. రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి వ్యవస్థ పునరుజ్జీవానికి తీసుకుంటున్న చర్యలతో రైతులకు మంచి జరగనున్నదన్నారు. గత వైసీపీ పాలనలో నిర్వీర్యమైన సాగు నీటి వ్యవస్థను గాడిలో పెట్టి సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు. చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా సాగునీటి సంఘాల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్‌శాఖ ప్రణాళికబద్ధంగా పనిచేస్తుందని మంత్రి వివరించారు. సన్న, చిన్న, కౌలు రైతులతో సహా సంతృప్తి చెందేలా సంఘాల పనితీరు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వందరోజు పాలనలో ఇచ్చిన హామీలను దశలవారీగా పూర్తి చేయనున్నామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయలు, డ్రెయిన్లు, చెరువులను అభివృద్ధిపర్చకుండా గత ఐదేళ్ల పాలనలో చేసిన పాపాలు శాపాలుగా మారాయని అన్నారు. నీటి సంఘాల ద్వారా సమన్వయ ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ పని చేస్తుందని మంత్రి తెలిపారు.