కలకత్తా హైకోర్టు ఆదేశం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల, ఆసుపత్రికి చెందిన మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో విచారణను సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను, వివరాలను బుధవారం ఉదయం 10గంటలకల్లా సీబీఐకి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. తమ ఆందోళనను విరమించుకొని విధులకు హాజరు కావాలని వైద్యులకు సూచించింది. వృత్తి ధర్మానికి కట్టుబడాలని హితవు పలికింది. అదే సమయంలో నిరసనకారులతో చర్చలు జరపాలని అధికారులకు హైకోర్టు సూచనలు చేసింది. తొలుత వాదనలు జరిగినప్పుడు వెంటనే హత్య కేసు ఎందుకు నమోదు కాలేదని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ శివగ్నానామ్ ప్రశ్నించగా హత్య జరిగినట్లు ఫిర్యాదు రాలేదు కాబట్టే అని ప్రభుత్వ న్యాయవాది బదులిచ్చారు. అసహజ మరణంగా కేసు నమోదు అయిందన్నారు. పోస్టుగ్రాడ్యుయేట్ ట్రైనీ మృతదేశం రోడ్డు పక్కన లభ్యం కాలేదు కాబట్టి ఆ ఆసుపత్రి ప్రిన్సిపల్ లేక సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయాలి కదా అంటూ సీజే నేతృత్వ డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. హత్య జరిగిన తీరు నేపథ్యంలో జూనియర్ వైద్యుల ఆందోళన, ఆగ్రహం సమర్థనీయమేనని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. కాగా, ఆర్‌జీ కార్ ఆసుపత్రి సెమినార్ హాలులో వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై అత్యాచారం, హత్య అక్కడే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఓ వలంటీరు శనివారం అరెస్టయ్యారు.