జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నవంబరుకు వాయిదా
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసు కుంది. జగన్ అక్రమాస్తుల కేసులపై ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వ ంలోని ధర్మాసనం… సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది. జగన్‌పై నమోదైన కేసుల ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఆయన బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలంటూ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సుప్రీం… మే 2న సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఆరుగురు జడ్జిలు మారిపోవడంతో పాటు రిటైర్ కూడా అయ్యారని రఘురామ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. దీనికి, ట్రయల్‌కి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, ట్రయల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని, తమకు ఎలాంటి అడ్డంకి రావడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సీబీఐ తరపున వాదనలు వినిపించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు న్యాయమూర్తికి తెలిపారు. ఇలాంటి కేసుల విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ చేపట్టాలని, ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున వాటిని అనుసరించాల్సిందేనని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టంచేశారు.