కేంద్రం కుట్ర… భూముల విక్రయానికి ఎత్తుగడ
కార్మికుల ప్రతిఘటనతో ప్రైవేటీకరణపై వ్యూహం మార్పు
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పరిశ్రమలో పనిచేసే కార్మికులతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. ఎలాగైనా సరే పరిశ్రమకు ఉన్న విలువైన భూములను బడాబాబులకు కట్టబెట్టాలనే యోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం, పరిశ్రమను కార్మికులు కోరుతున్నట్లుగా సెయిల్‌లో విలీనం చేసి…నష్టాల భర్తీ పేరుతో దాని భూములు అమ్మాలని యోచిస్తోంది. కేంద్రప్రభుత్వ చర్యల కారణంగా గత కొంతకాలంగా ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)ను మరో ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో (సెయిల్) విలీనం చేసే అంశాన్ని కేంద్రం ప్రస్తుతం పరిశీలిస్తోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిని ప్రైవేటీకరించి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో, అదానీలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వరంగంలో సెయిల్‌తో సహా ఇతర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుండగా, విశాఖ స్టీల్ మాత్రం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవల్సి వస్తుంది. ప్రైవేటు రంగంలోని అన్ని స్టీల్ ప్యాక్టరీలకు క్యాప్టివ్ మైన్స్, ఇనుప ఖనిజం, బొగ్గు కేటాయిస్తుండగా, విశాఖ స్టీల్‌కు కావాలని క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం లేదు. ముడిసరుకు, మూలధనం కొరతను అధిగమించడానికి గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జాతీయ, అంతర్జాతీయ బిడ్‌లను ఆహ్వానించగా, సెయిల్, ఎన్‌ఎండీసీలను పాల్గొనకుండా కేంద్రం మోకాలడ్డింది. దీనివల్ల బిడ్ ఏ ప్రైవేటు కంపెనీకి దక్కినా ఆ కంపెనీని పోస్కో కొనేస్తుంది. ఇటువంటి కేంద్ర కుట్రలను వ్యతిరేకిస్తూ గత మూడు సంవత్సరాలుగా పరిశ్రమ కార్మికులు నిరవధికంగా పోరాడుతున్నారు. మోదీ రెండో సారి గద్దె నెక్కిన తర్వాత ‘జాతీయ మానిటైజేషన్ పైప్ లైన్’ను ప్రకటించింది. 2025 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల భూములతో సహా ఆస్తులను ప్రైవేటు రంగానికి అప్పజెప్పడానికి నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ముందుగా స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 3వేల ఎకరాల్లో రోలింగ్ మిల్ ఏర్పాటు చేయడం, మెజార్టీ వాటా పోస్కోకు, మైనార్టీ వాటా స్టీల్ ప్లాంట్‌కు ఉండేలా జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.బహిరంగ మార్కెట్లో ఆ భూమి విలువ దాదాపు రూ.30వేల కోట్లు ఉంటుందని అంచనా. స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కొంటున్న నేపధ్యంలో, దీన్ని అధిగమించేందుకు సెయిల్ విలీన అంశాన్ని ఒక ప్రత్యామ్నాయంగా కేంద్రం భావిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్లాంట్‌కు రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ కోసం ప్రస్తుతం 2నుంచి 3వేల ఎకరాల భూమిని విక్రయించే యోచన చేస్తోంది. అయితే విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని, 100 శాతం సామర్థ్యంలో పరిశ్రమను నడపాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు, నష్టాల భర్తీ పేరుతో భూములు అమ్మడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రుల పోరాట పటిమకు, ఆత్మగౌరవానికి సజీవ సాక్ష్యమైన విశాఖ స్టీలు ప్లాంట్ రక్షణకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని కార్మికులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సందర్భంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినందున, దానిని నిలబెట్టుకోవాలని, కేంద్రంపై ఆ మేరకు ఒత్తిడి తేవాలని కార్మికులు కోరుతున్నారు.