విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించబోమని చెబుతోన్న కేంద్రం ప్రైవేటీకరణ దిశగా చర్యలు చేపడుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద నిత్యం ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే చర్యల్లో భాగంగా 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపు ప్రక్రియపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం స్టీల్ ప్లాంట్‌లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్స్ భవనాన్ని చుట్టుముట్టారు. తమకు న్యాయం చేయాలని, తమ తొలగింపునకు పూనుకుంటున్న స్టీల్‌ప్లాంట్ యాజమాన్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, సీఐపస్‌ఎఫ్ బలగాలు అక్కడకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో పెద్దఎత్తున చేరుకున్న కార్మికుల ఆగ్రహానికి ఈడీ కార్యాలయం అద్దాలు పగిలాయి. గత రెండు రోజుల క్రితం తొలగింపు చర్యలకు పూనుకున్న యాజమాన్యం అక్టోబరు 1 నుంచి పాస్‌లు నిలుపుదల చేయడంతో పెద్దఎత్తున ఈ ఆందోళనకు దిగారు. స్కిల్డ్, అన్ స్కిల్డ్, సెమి స్కిల్డ్ పద్ధతిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలన్న యాజమాన్య వైఖరికి నిరసనగా చేపట్టిన ఈ ఆందోళనకు కార్మిక సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికుల నిరసనతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. మరో పక్క ఉక్కు కార్మికుల ఉద్యమాన్ని ఉధృతం చేశారు. స్టీల్ ప్లాంట్ బీసీ గేటు వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియలో తాత్కాలికంగా వెనక్కు తగ్గినా, భవిష్యత్‌లో తొలగింపునకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉక్కు కార్మికులను ఏం చేద్దామనుకుంటున్నారు : శాసనమండలి విపక్ష నేత బొత్స
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని శాసనమండలి విపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నిర్ణయంపై బొత్స విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఒకేసారి 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారని, మరి మీ పాలనలో ఉద్యోగాలిస్తున్నారా స్టీల్ ప్లాంట్ కార్మికులతో మొదలుపెట్టి అందరినీ తొలగింపునకు పూనుకుంటున్నారా అని ప్రశ్నించారు.