ఈనెల16న నోటిఫికేషన్ డిసెంబరు 10న ఓటింగ్
14న కౌంటింగ్
దిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాలలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో 12 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని 11 స్థానాలు.. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో రెండేసి ఉండగా అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో తొమ్మిది జిల్లాల్లోని 12 స్థానాలు కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో రెండేసి చొప్పున ఆదిలాబాద్ మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఏప,ీ తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల నుంచి 42 స్థానాలకు డిసెంబరు 10న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మహారాష్ట్రలో ఏడు స్థానాలకు చెందిన ఎనిమిది మంది సిట్టింగ్ సభ్యులు పదవీకాలం వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీతో ముగియనున్నట్లు తెలిపింది. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో రెండు ముంబైలో ఉన్నాయి. ఇక కర్ణాటకలో 20 స్థానాలకు చెందిన 25 మంది పదవీకాలం జనవరి 5వ తేదీతో ముగియనుండటంతో అక్కడ ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ వెల్లడిరచింది. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపింది. అలాగే, 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణకు గడువు ఉన్నట్లు పేర్కొంది. డిసెంబరు 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉండగా అదేనెల 16వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ వెల్లడిరచింది. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలను ఈసీ జారీచేసింది. ఈ క్రమంలో సీనియర్ అధికారిని నియమించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చింది.