జనజీవనం అస్తవ్యస్తం
. అల్లూరి జిల్లాలో కొండచరియలు విరిగిపడి యువతి మృతి
. తీరం దాటిన తీవ్ర వాయుగుండం
విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం / పాడేరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాకు దగ్గరలో పూరి వద్ద తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎగువ నుండి వచ్చిన వరద పోటుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి పంటలు నీట మునిగాయి. ఏజెన్సీలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. అనకా పల్లి జిల్లాలో అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాగునీటి ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్ అధికారులు పరిశీలించి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి ఉధృతి కొనసాగు తుండగా… విశాఖ జిల్లాలో కొండవాలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. భీమిలి నియోజకవర్గంలో కొన్ని ఇళ్లు నేలమట్టమ య్యాయి. పద్మనాభం మండలంలో ఓ పాఠశాల ప్రమాదకరంగా ఉండడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దగ్గరుండి జేసీబీతో కూల్చివేత పనులు చేయించారు. సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయ నగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో వర్షాలు తగ్గినప్పటికీ వరద పోటు తగ్గలేదు. అరకు- విశాఖపట్నం వచ్చే ఘాట్ రోడ్లలో కూడా కొండచరియలు విరిగిపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలను తొలగించాలని గిరిజన ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికే వారం రోజులుగా వరద ముంపులో ప్రజలు తీవ్రఇబ్బంది పడుతుండగా… శనివారం నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో దిక్కుతోచని స్థితికి వెళ్లారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి, నాగావళి, వంశధార, రైవాడా, తాండవ, తాటిపూడి, మేఘాద్రి గెడ్డ, గంభీరం, పెద్ద గెడ్డ, తోటపల్లి వంటి జలాశయాల్లో ప్రమాదకర స్థాయికి వరద నీరు చేరడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనజీవనం అస్త్యవస్తమైంది. సోమవారం ముందస్తుగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉదయం 8.30 వరకు గడచిన 24గంటల్లో అల్లూరి జిల్లా చింతపల్లిలో 13 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో 11 సెంటీమీటర్లు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ, బొండపల్లి, విశాఖ జిల్లా భీమిలిల్లో 10 సెంటీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. మేఘాద్రి గెడ్డ గరిష్ట నీటిమట్టం 61 అడుగులు కాగా, ప్రస్తుతం దిగువ నీటిమట్టం 57.8 అడుగులు కు చేరింది. 58 అడుగులకు నీటిమట్టం చేరుకోగానే గేట్ల ఎత్తివేతకు అధికారులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే జీవీఎంసీ 89 వ వార్డు కొత్తపాలెం, ఎల్లపు వానిపాలెం ఎస్సీ కాలనీ, భగత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలలో ప్రజలను జీవీఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అనకాపల్లి జిల్లాలో వరద పరిస్థితిని హోం మంత్రి అనిత పర్యవేక్షించారు.
భారీ వర్షాలకు ‘అల్లూరి’ అతలాకుతలం
అల్పపీడనం ప్రవాహంతో గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గాను అల్లూరి సీతారామరాజు జిల్లా అతలాకుతమైంది. ఆదివారం రాత్రి జీకే వీధి మండలం లోని సప్పర్ల పంచాయతీ చట్రపల్లి గ్రామం పై కొండ చర్యలు విరిగిపడడంతో ఓ20 ఏళ్ల యువతి మృతి చెందింది. కొర్ర పండన్న (60), కొర్ర సుమిత్ర (18), కొర్ర సుబ్బారావు (25) అనే ముగ్గురు గాయపడ్డారు. ఆ గ్రామంలో చాలా ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం గ్రామానికి చేరుకోవడానికి ఎటువంటి రవాణా సౌకర్యం కూడా లేకుండా పోయింది. ఆ గ్రామంలో ప్రస్తుతం 30 కుటుంబాలకి చెందిన 200 జనాభా నివసిస్తున్నారు. జిల్లాలో వాగులు వంకలు, చిన్నపాటి కాలువలు పొంగిపొర్లుతుండగా… కొన్నిచోట్ల బ్రిడ్జిలు కూలిపోయాయి. రహదారులు ఛిద్రమయ్యాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
పూరీ: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడిరచింది. ప్రస్తుతం పూరీకి వాయవ్య దిశగా పయనిస్తోందని, దీని ప్రభావం సోమవారం రాత్రి 7.30 వరకు కొనసాగుతుందని తెలిపింది. చత్తీస్‌గఢ్ దిశగా పయనించి క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఒడిశాలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాల్కాన్‌గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహూజా భువనేశ్వర్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రిలీఫ్ కమిషనర్ డి.ఆర్.సింగ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు వచ్చే అవకాశం లేదని చెప్పారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 30కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని, భారీ వర్షాలు కురవవచ్చని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు పేర్కొన్నారు.