. పది విద్యార్థులకు రాష్ట్ర బోర్డు పరీక్షలే…
. భవిష్యత్‌లో 6 నుంచి 9 తరగతులకు కూడా…
. పూర్తిగా రద్దు చేస్తే… బోధన రెండు భాషలలోనూ ఉంటుందా?
విశాలాంధ్ర బ్యూరోఏలూరు: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యా శాఖలో కూడా సంస్కరణల పర్వాన్ని మొదలుపెట్టింది. తొలుత విద్యాశాఖలో ఉన్నతాధికారుల స్థాయిలో మార్పులు చేశారు. తరువాత పాఠశాల స్థాయిలో పని సర్దుబాటు పూర్తి చేసి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు విద్యార్థుల స్థాయిలో మార్పులను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,000 సీబీఎస్‌ఈ పాఠశాలల్లో సెంట్రల్ బోర్డ్ సిలబస్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క సంవత్సరానికి రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విధానంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర బోర్డు ద్వారా పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులలో సన్నద్ధత లేకపోవడం ముఖ్యమైన కారణంగా కనిపిస్తుండటంతో సీబీఎస్‌ఈ విధానం రద్దు చేయడానికి ఉన్నత స్థాయిలో నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,000 సీబీఎస్‌ఈ స్కూళ్లలో 6 నుంచి 10 తరగతులలో 4,41,472 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో పదో తరగతిలో 77,478 మంది ఉన్నారు. 2025లో జరిగే సీబీఎస్‌ఈ 10 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి గత నెలలో అంతర్గత పరీక్షలను ఆన్ లైన్‌లో నిర్వహించారు. ఇంగ్లీషు, లెక్కలు, సైన్సు, సోషల్ సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు రాసిన పదో తరగతి విద్యార్థులలో దాదాపు 70 శాతం మంది ఉత్తీర్ణులు కాలేదు. ఇటువంటి ఫలితాలతో 2024
25లో సీబీఎస్‌ఈ పదవ తరగతి పరీక్షలు రాస్తే ఉత్తీర్ణత శాతం తగ్గడం ఖాయమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి 10 విద్యార్థులకు సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు నిర్ణయం మాత్రమే జరిగింది. కానీ భవిష్యత్‌లో 6, 7, 8 9 తరగతులలో కూడా సీబీఎస్‌ఈ విధానం రద్దయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్‌లతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన ద్విభాష అచ్చు పుస్తకాల పంపిణీ జరిగింది. అన్ని పాఠశాలల్లో ఒకే రకమైన సిలబస్‌ను బోధిస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రశ్న పత్రాలతోనే ఎఫ్‌ఏ1 (సెల్ఫ్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్
1 (2024 -25) పరీక్షలను అన్ని పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిది తరగతి వరకు నిర్వహించారు. ప్రశ్న పత్రాన్ని కూడా రెండు భాషల్లో ముద్రించారు. సీబీఎస్‌ఈ, స్టేట్ సిలబస్ అనే తేడా లేకుండా విద్యార్థులందరూ ఈ ప్రశ్న పత్రాలతోనే పరీక్షలు రాశారు.
వాస్తవానికి 1,000 సీబీఎస్‌ఈ స్కూళ్లకు సెంట్రల్ బోర్డ్ నుంచి ప్రశ్నాపత్రాలు ఆన్ లైన్ లో పంపిణీ కావాల్సి ఉంది. పూర్తి ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే, రానున్న రోజులలో సీబీఎస్‌ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ సిలబస్‌ను అమలు చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే బోధన తెలుగు మీడియంలో ఉంటుందా? ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? లేక రెండు భాషలలోనూ ఉంటుందా? అనే అంశం తేలాల్సి ఉంది.