ఆరు రాష్ట్రాల విధానాలు పరిశీలించిన కేబినెట్ సబ్ కమిటీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కల్తీ మద్యం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే లక్ష్యంగా అక్టోబరు 1వ తేదీ నుంచి నూతన విధానం అమల్లోకి తెస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళగిరి ఆటోనగర్‌లోని సెబ్ కార్యాలయంలో కొల్లు రవీంద్ర అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. మంత్రులు గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ అధ్వర్యంలో మద్యం విధానంపై సమావేశం సమీక్షించింది. అనంతరం కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడుతూ ‘అధికారంలోకి వస్తే మెరుగైన విధానం తెస్తామన్న హామీ మేరకు సబ్ కమిటీ ఏర్పాటుచేశాం. ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానాలను పరిశీలించిన తర్వాత తుది నివేదిక రూపొందిస్తున్నాం. ప్రభుత్వ దుకాణాలు, ప్రైవేటు దుకాణాలనూ పరిశీలించాం. ఆదాయం కంటే ప్రజల ప్రాణాలకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. మరోసారి సమావేశమై విధానానికి తుదిమెరుగులు దిద్దుతాం. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే బ్రాండ్లు ఏపీలో ఉండేలా ఉత్తమ విధానాన్ని తెస్తాం’ అని అన్నారు. పది రోజులుగా వరదలతో ముప్పతిప్పలు పడుతుంటే రాష్ట్ర ప్రజలను పట్టించుకోని పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు నేరస్తుల కోసం జైలుకు వెళ్లడం హాస్యాస్పదమన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని సమర్థించేందుకు సిగ్గుపడాలని జగన్‌నుద్దేశించి అన్నారు. ‘పడవలతో ప్రకాశం బ్యారేజీని కూలగొట్టేందుకు కుట్ర చేశారు. లక్షల మందిని చంపి పైశాచిక ఆనందం పొందాలనుకున్నారు’ అని మంత్రి విమర్శించారు. పద్ధతి మార్చుకోకపోతే గతంలో వచ్చిన సీట్లు కూడా రావని జగన్‌ను ఆయన హెచ్చరించారు.