మంత్రి కొల్లు రవీంద్ర
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుంచి ఇసుక రీచ్‌లు ప్రారంభించి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం కృష్ణాజిల్లాలో ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ ప్రారంభించిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ నిర్వాకంతోనే ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. పేదలం దరికీ ఉచితంగా ఇసుక అందించి తీరతామని, త్వరలోనే ఇసుక సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మంత్రి తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుతున్నా మన్నారు. ఇసుకను జగన్ ఆదాయ వనరుగా భావిస్తే… తాము మాత్రం ప్రజలకు ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వర్షాకాలంలో వరదల దృష్ట్యా ఇసుక తవ్వకూడదనే ఎన్జీటీ ఆదేశాల మేరకు రీచ్‌లు నిలిపివేశామన్నారు. అక్టోబర్ 15 నుంచి ఇసుక రీచ్‌లన్నీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. బోట్‌మెన్ సొసైటీలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు చేపడతామన్నారు. దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలు అధికమవుతున్నాయనే సమస్యనూ పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడిరచారు. ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిందని, అదే సమయంలో వ్యర్థాలు కూడా పెరుగుతున్నాయన్నారు. అయితే ఈ పాత వస్తువులు మట్టిలో కలిసే అవకాశం లేకపోవడం, మరలా పునర్వినియోగం చేసే పరిస్థితి లేకపోవడం, మరోవైపు పాతసామాన్లు కొనుగోలు చేసే వారు వీటిని కాల్చేయడం లేదా పగుల గొట్టడం ద్వారా కాలుష్యం పెరుగుతుందని, అందుకే వీటికి ప్రత్యేక విధానం తీసుకురానున్నట్లు మంత్రి వివరించారు.