నూతన మద్యం పాలసీతో పాటు బుడమేరు ఆపరేషన్‌పై నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఈనెల 18వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం ఒకటవ బ్లాక్‌లో జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు, సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. ముఖ్యంగా బుడమేరు ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి? ఎంత నష్టపరిహారం చెల్లించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. ఈనెల 17వ తేదీలోపు పూర్తి చేయాలనే లక్ష్యంగా అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం ప్రకటిస్తుందనే ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానినిబట్టి నష్టపరిహారంపై నిర్ణయం తీసుకోనున్నారు. విజయవాడ నగరం మరోసారి ముంపునకు గురికాకుండా శాశ్వత నివారణ చర్యల్లో భాగంగా హైడ్రా తరహాలో ఇక్కడ కూడా బుడమేరు ఆక్రమణలు తొలగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో ఇప్పటికే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు ఆహ్వానించగా… తక్షణమే ప్రారంభించాల్సిన నిర్మాణపనులపైనా మంత్రివర్గం చర్చించనుంది.