న్యూదిల్లీ : ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ఇప్పటివరకు 209.52 లక్షల టన్నుల వరిని రూ.41,066.80 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం మంగళవారం వెల్లడిరచింది. 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు నడుస్తుంది. ఆహారధాన్యాల సేకరణ, పంపిణీకి గాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా ఉంది. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో నవంబర్ 8 వరకు 209.52 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసినట్లు ఆహార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.చండీగఢ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, బీహార్ రాష్ట్రాల నుంచి వరిని కొనుగోలు చేసినట్లు తెలిపింది. దీని ఫలితంగా దాదాపు 11.57 లక్షల మంది రైతులు 41,066.80 కోట్ల రూపాయల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విలువతో లబ్ధి పొందినట్లు పేర్కొంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వరి సేకరణ సాఫీగా సాగుతున్నట్లు వెల్లడిరచింది.