. పెరిగిన ధరలు, కొత్త రేషన్‌కార్డులపై ఆందోళనలు
. సెప్టెంబరులోగా శాఖా సమావేశాలు పూర్తి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విజయవాడ దాసరిభవన్‌లో ఈనెల 28వ తేదీన జరగనున్న భూ బాధితుల రాష్ట్ర సదస్సుకు బాధితులతో కలిసి పెద్దఎత్తున అర్జీలతో తరలిరావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.
బుధవారం విజయవాడ నుంచి పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులతో రామకృష్ణ జూమ్ సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి అధ్యక్షత వహించగా, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ పాల్గొన్నారు. జిల్లాల నుంచి సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, జంగాల అజయ్‌కుమార్, డేగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శులు హాజరయ్యారు. సెప్టెంబరు నెలలోగా సీపీఐ అన్ని శాఖల సమావేశాలు పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని రామకృష్ణ తెలిపారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సెప్టెంబరు 1 నుంచి 7 వరకు పెరిగిన ధరలపైన, కొత్త రేషన్‌కార్డుల కోసం ఆందోళనలు నిర్వహించాలన్నారు. సెప్టెంబరులోగా అన్ని పార్టీ శాఖా సమావేశాలు పూర్తి చేయాలని, ఆ రకంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో భూ ఆక్రమణలకు గురైన వారి నుండి, పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై ప్రజల నుంచి పెద్దఎత్తున బాధితుల సంతకాలతో కూడిన అర్జీలు సేకరించాలన్నారు. మదనపల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల ధ్వంసం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయని రామకృష్ణ వివరించారు. చాలామంది బాధితులు ముందుకు వచ్చి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఆయా సమస్యలపై సీపీఐ శ్రేణులు పూర్తిస్థాయిలో స్పందించారని, తనతోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, పార్టీ రాష్ట్ర, స్థానిక నేతలు ఆయా ప్రాంతాల్లో పర్యటించామని రామకృష్ణ గుర్తుచేశారు. పేదలకు చెందిన అన్యాక్రాంతమైన భూములు, ఇళ్ల స్థలాలపై బాధితులచేత అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు సమర్పించామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో విలువైన భూమిని వైసీపీ శ్రేణులు దొంగపట్టాలు సృష్టించి విక్రయానికి సిద్ధపడగా, దానిని సీపీఐ శ్రేణులు అడ్డుకున్నాయని రామకృష్ణ చెప్పారు. వినుకొండలోని మసీదు మాన్యాల ఆక్రమణపైన, తూర్పుగోదావరి జిల్లా భీమోలులో ఇళ్ల స్థలాల సమస్యపై బాధితుల సంతకాలు సేకరించి తీసుకురావాలన్నారు. ఈనెల 28న విజయవాడలో జరిగే భూ బాధితుల రాష్ట్ర సదస్సులో ఆయా భూ సమస్యలపై చర్చించి, పార్టీ రాష్ట్ర కమిటీ ద్వారా సీఎం చంద్రబాబుకు, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌కు, రెవెన్యూ ఉన్నతాధికారులకు వినతులు అందజేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 27, 28 తేదీల్లో కిడ్నీ బాధిత సమస్యలపై పాదయాత్ర జరుగుతుందని, దాని జయప్రదానికి ఆ జిల్లా వాసులు దృష్టి పెట్టాలని చెప్పారు. విశాఖలో సెప్టెంబరు 1,2,3 తేదీల్లో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలు జరగనున్నాయని, దానికి పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. సెప్టెంబరు 3,4,5 తేదీల్లో విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్రస్థాయి రాజకీయ, సైద్ధాంతిక శిక్షణ తరగతులకు అన్ని జిల్లాల నుంచి యువజన ప్రతినిధులను పంపాలని కోరారు. పార్టీ జిల్లా శాఖా సమావేశాలు పూర్తయిన వెంటనే, అన్ని జిల్లాల ప్రజాసంఘాలతో రాష్ట్ర సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం సమస్యలపైన, కౌలురైతుల సమస్యలపైన సంఘాలు చేపట్టబోయే ఉద్యమాలు, వినతుల కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలని, ఉపాధి హామీ పథకం అమలుపై ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభల్లో వినతులు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.