. కులగణనపై విపక్షంతో గొంతు కలిపిన జేడీ(యూ)
. ఇప్పటికే మద్దతిచ్చిన ఎల్జేపీ
. ఎన్డీఏ సర్కారుపై పెరుగుతున్న ఒత్తిడి
. జనగణనతో పాటు కులసర్వేకు యోచన!
న్యూదిల్లీ : కులగణన విషయంలో జెడీ(యూ) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పట్టుదలగా ఉన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కుల గణన జరపాలని డిమాండ్లు వెలువెత్తుతున్న వేళ.. అధికార ఎన్డీయేలో ఈ అంశం కుంపట్లు రాజేస్తోంది. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ సైతం ఇదే డిమాండ్‌ని తెరపైకి తెచ్చింది. ఓబీసీల సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటు కమిటీలో జేడీయూ చేరింది. కుల గణన కోసం ప్రతిపక్ష ఇండియా ఐక్య సంఘటనతో గొంతు కలిపింది. బీజేపీ మిత్రపక్షమైన లోక్‌జనశక్తి పార్టీ (రాం విలాస్) కూడా ఇప్పటికే కులగణనకు మద్దతు ప్రకటించింది. దీంతో ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జాతీయ స్థాయిలో సామాజిక`ఆర్థిక కులగణన వల్ల ప్రజల స్థితిగతులు తెలుస్తాయని, తద్వారా సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అందించవచ్చని కాంగ్రెస్ మొదటి నుంచి చెబుతోంది. సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి జాతీయ కులగణనకు డిమాండ్ చేస్తోంది. జేడీ(యూ) కూడా కలిసి రావడంతో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది. మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కులగణన విషయంలో నెమ్మదిగా ఉన్న జేడీ(యూ) ఇప్పుడు దాని కోసం డిమాండ్ చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన పార్లమెంటు కమిటీలో కులగణనపై చర్చ కోసం జేడీ(యూ) పట్టుబట్టింది. గతంలోనూ కులగణనకు జేడీ(యూ) అనుకూలంగా ఉంది. బీహార్‌లో తమ పార్టీ అధికారంలో ఉండటంతో కులాధారిత సర్వేను సీఎం నితీశ్ కుమార్ చేపట్టారు. సర్వే ఫలితాలు గతేడాదిలో వెలువడ్డాయి. ఆ రాష్ట్ర జనాభాలో 69శాతం మంది వెనుకబడిన వర్గాల వారని తేలింది. అయితే పదేళ్లకొకసారి జనగణన నిర్వహించడం ఆనవాయితీ కాగా కోవిడ్ కారణంగా 2021 నుంచి ఆ ప్రక్రియ వాయిదా పడతోంది. జనగణనకు కేంద్రప్రభుత్వం షెడ్యూల్ త్వరలో ప్రకటించబోతోంది కాబట్టి కులగణన డిమాండ్ బిగ్గరగా వినిపిస్తోంది. విపక్షాలతో పాటు తమ మిత్రపక్షాల నుంచీ తీవ్ర ఒత్తిడి ఎదురువుతుండటంతో మోదీ ప్రభుత్వం ఇరకాటంలో పడిరది. జనాభా లెక్కలతో పాటుగా కులగణనను చేపట్టేందుకు యోచిస్తోంది. ఇదిలావుంటే, బీజేపీ ఎంపీ గణేశ్ సింగ్ అధ్యక్షతన వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన పార్లమెంటు కమిటీ తొలి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా కులగణన అంశాన్ని డీఎంకే నేత బాలూ లేవనెత్తారు. కాంగ్రెస్ సభ్యుడు మాణికం ఠాకూర్ , టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తెలిపారు. కమిటీ చర్చించాల్సిన అంశాల్లో మొట్టమొదటిగా కులగణన ఉండాలన్నారు. కుల సర్వే నిర్వహించేలా కేంద్ర హోంశాఖకు లేఖ పంపాలని కమిటీని కోరారు. జేడీ(యూ) ఎంపీ గిరిధరీ యాదవ్ కూడా కులగణన కోసం పట్టుబట్టారు. కమిటీ జరిపే చర్చల్లో ఇందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటూ విపక్షాలతో గొంతు కలిపారు. మోదీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీ విపక్షాలతో కలిసి కులగణన కోసం డిమాండ్ చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. జేడీ(యూ) నేత కేసీ త్యాగి ఓ వార్తపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కులగణనకు మద్దతు తెలిపారు. కులగణన నిర్వహణకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ అంశంలో కేంద్రంతో వివాదాన్ని కోరుకోవడంలేదని కూడా ఆయన చెప్పారు.
కాగా, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై గతనెలలో లోక్‌సభ వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘అనురాగ్ ఠాకూర్ నన్ను అవమానించారు కానీ ఆయన నుంచి క్షమాపణను ఆశించడంలేదు. నేను సమరశంఖాన్ని పూరిస్తున్నా. మీరు నన్ను ఎంతగా అవమానించినా పర్వేలేదు. కులగణనకు ఈ సభ ఆమోదం తప్పక లభిస్తుందన్నది గుర్తుపెట్టుకోండి’ అని అన్నారు. జనగణనకు సెప్టెంబరు నుంచి కసరత్తు మొదలవుతున్న నేపథ్యంలో కులగణనను నిర్వహించాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖను ప్రతిపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.