కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వసంత్ కుంజ్‌లోని నివాసం నుండి మూడు దశాబ్దాలుగా పని చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌కు తరలించారు. దివంగత నేతకు నివాళులు అర్పించేందుకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు, పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, మేధావులు, వివిధ వర్గ, సంఘాల నాయకులు, ప్రజా ఉద్యమాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎకెజి భవన్‌కు చేరుకొని సీతారాంకు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. ప్రముఖ చరిత్రకారిణి ప్రొఫెసర్ రొమిల్లా థాపర్, కాంగ్రెస్ నాయుకురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా తదితరులు నివాళులర్పించారు. ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ఏకేజీ భవన్‌కు వచ్చి సీతారాం ఏచూరికి నివాళులర్పించారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అస్సాం, బీహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీల సిపిఎం నేతలు సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎకెజి భవన్ నుంచి ఎయిమ్స్ వరకు అంతిమ యాత్ర సాగుతుంది. అనంతరం ఆయన కోరుకున్న విధంగా భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు కుటుంబ సభ్యులు అప్పగిస్తారు.
ఎయిమ్స్ నుంచి జెఎన్‌యుకు తీసుకొచ్చి స్టూడెంట్స్ యూనియన్ హాలులో శుక్రవారం సాయంత్రం ఉంచారు. సాయంత్రం 4 గంటల వరకు జెఎన్‌యులో నివాళులర్పించే కార్యక్రమం కొనసాగింది. ఆ తరువాత ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల సందర్శనార్థం వసంత్ కుంజ్‌లోని నివాసానికి తరలించారు.