తమ కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
నటి కాదంబరీ జత్వానీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాజీ సర్పంచ్ చిందా వీరవెంకట నాగేశ్వరరాజు తాజాగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు వెల్లడించారు. ఈ వ్యవహారంతో తనకు అసలు సంబంధమే లేదని తేల్చి చెప్పారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదులో కీలక సాక్షిగా ఉన్న ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో కేసు మరో మలుపు తిరిగింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. జగ్గయ్యపేటలోని తన ఐదెకరాల భూమిని నటి జత్వానీకి విక్రయించినట్టు ఆమె స్వయంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించారని, ఆపై ఆ భూమిని నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్‌కుమార్‌కు అమ్మజూపారని, అడ్వాన్స్‌గా రూ. 5 లక్షలు కూడా తీసుకున్నారనేది విద్యాసాగర్ ఆరోపణ. ఇదే విషయమై ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా నాగేశ్వరరాజు కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమకు ఎవరూ భూమిని విక్రయించాలని అనుకోలేదని, తాము ఎవరికీ అడ్వాన్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు. విద్యాసాగర్ తండ్రి అయిన కుక్కల నాగేశ్వరరావు తమకు సన్నిహితుడని.. అయితే, విద్యాసాగర్‌తో తమకు ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖల కోసం ఇచ్చిన ఆధార్‌కార్డులను నాగేశ్వరరావు వ్యక్తిగత సహాయకుడు గొరిపర్తి శ్రీనివాసరావు దుర్వినియోగం చేసి ఈ కేసులో ఇరికించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు చేసిన పనితో తమ కుటుంబ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.