అతి సమీపంలో వెళ్లిన రైలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విజయవాడ నగర పరిధిలోని మధురానగర్‌లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో నాలుగు రోజులుగా చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా వినకుండా నీళ్లలో దిగి బాధితులను ఓదారుస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం బుడమేరుకు అంత వరద ఎలా వచ్చింది? భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదం తలెత్తకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? ఆక్రమణలు ఏ మేరకు ఉన్నాయి? తొలగించడానికి ఉన్న అవకాశాలు ఏమిటి? తదితర అంశాలను ప్రత్యక్షంగా చంద్రబాబు పరిశీలించారు. దీనిలో భాగంగా మధురానగర్ వద్ద వరదను పరిశీలించేందుకు సీఎం రైలు వంతెన పైకి ఎక్కారు. అక్కడ బ్రిడ్జిపై నడుస్తూ బుడమేరు ఉద్ధృతిని చంద్రబాబు పరిశీలించారు. వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు అతి సమీపంగా రైలు ముందుకు వెళ్లింది. భద్రతా సిబ్బంది హెచ్చరికతో రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో ప్రమాదం తప్పింది. రైలు వెళ్లిపోయాక అధికారులు, భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.