ఏపీలో ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాల పేర్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే మార్చిన విషయం తెలిసిందే. ఇదే కోవలో ఇప్పుడు మరో పథకం పేరును మార్చింది. జగన్ సర్కార్ అమలు చేసిన ఃశాశ్వత భూ హక్కు-భూ రక్షణః పథకం పేరును ఃఏపీ రీ సర్వే ప్రాజెక్టుఃగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ స్కీమ్ ను గ్రామాల్లో భూవివాదాలు, తగాదాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో తీసుకువచ్చామని అప్పట్లో జగన్ ప్రభుత్వం పేర్కొంది. దీనిలో భాగంగా భూముల సమగ్ర రీ సర్వే చేపట్టారు. కానీ, ఈ పథకం ఆచరణలోకి వచ్చేసరికి భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో బాధితులు ఃశాశ్వత భూ హక్కు-భూ రక్షణః పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఈ స్కీమ్ అమలు తీరును అప్పటి ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా ఖండించింది. తాము అధికారంలోకి వస్తే ఈ స్కీమ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయడం జరుగుతుందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఃశాశ్వత భూ హక్కు-భూ రక్షణ పథకంః పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.