ఘటనపై స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం చంద్రబాబు
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటన మరువక ముందే పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన కార్మికులను ఝార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు.
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, ఇతర అధికారులను సీఎం ఆదేశించారు. కాగా, విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.