ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అతని స్థానంలో ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి అతిశీని సీఎం పదవికి కేజ్రీవాల్, పార్టీ ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. దీంతో ఆమె తదుపరి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఆమె ఈనెల 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ఆమె ప్రమాణ స్వీకారానికి సెప్టెంబర్ 21వ తేదీని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రతిపాదించారు.. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బుధవారం తెలియజేశారని అధికార వర్గాలు తెలిపాయి. అతిశితోపాటు మంత్రులుగా పలువురు ఆప్ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఢిల్లీకి ఇప్పటి వరకు ఏడుగురు సీఎంగా పనిచేశారు. అతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే.. ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రి అవుతారు. అదేక్రమంలో మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిశీ రికార్డుల్లోకి ఎక్కనున్నారు. గతంలో ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రులుగా సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్ పనిచేశారు. షీలా దీక్షిత్ గతంలో 1992 డిసెంబర్ 3 నుంచి 2023 డిసెంబర్ 28వరకు అంటే.. 15 సంవత్సరాల 25 రోజులుపాటు ఢిల్లీ సీఎంగా కొనసాగారు. 1998 అక్టోబర్ 12 నుంచి అదే ఏడాది డిసెంబర్ 3వ తేదీ వరకు అంటే.. 52రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మాస్వరాజ్ పనిచేశారు.