వైద్యురాలి జుట్టు పట్టుకుని దాడి చేసిన రోగి..
బెడ్ ఇనుప ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదిన వైనం
అతడి బారి నుంచి రక్షించిన సహచర వైద్యులు..దాడికి నిరసనగా వైద్యుల ఆందోళన
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో ఓ రోగి వైద్యురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సహచర వైద్యులు వెంటనే స్పందించి అతడి బారి నుంచి ఆమెను కాపాడారు. శనివారం తాను ఎమర్జెన్సీ వార్డులో విధుల్లో ఉండగా రోగి బంగార్రాజు ఒక్కసారిగా వెనక నుంచి దాడిచేసి తన జుట్టును బలంగా పట్టుకుని ఆసుపత్రి బెడ్ స్టీల్ ఫ్రేమ్ కేసి బాదాడాని స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్‌కు బాధిత వైద్యురాలు ఫిర్యాదు చేసింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రతను ఈ ఘటన మరోమారు ప్రశ్నార్థకంగా మార్చిందని, నిందితుడి చేతిలో కనుక ఆయుధం ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని బాధిత వైద్యురాలు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన తర్వాత వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదైనదీ, లేనిదీ తెలియరాలేదు.