తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యం పెట్టడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదాలనే స్వామికి నైవేద్యం పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించినట్లు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలలో బయటి వ్యక్తులు తయారు చేసిన ప్రసాదాలను నిషేధించాలని, తిరుమలలో లడ్డూ ప్రసాదాల తయారీ మొత్తం ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే జరిపించాలని కోరారు. అలా తయారుచేసిన ప్రసాదాలను మాత్రమే దేవుళ్లకు సమర్పించాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా భక్తులు, సాధుసన్యాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా మార్కెట్లో అమ్ముతున్న నూనె, నెయ్యిల నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.