వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సీఆర్‌జడ్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నేహారెడ్డి అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు లేవని గుర్తు చేస్తూ రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలు ఆపవద్దని జీవీఎంసీకి సూచించింది. అక్రమ నిర్మాణం విషయంలో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలతో స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నేహారెడ్డి తరపున న్యాయవాది చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. విశాఖలో అక్రమ నిర్మాణాలపై జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనంలో బుధవారం మరోసారి విచారణ జరిగింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జీవీఎంసీ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు.